భారత దేశంలో నానాటికీ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు…పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. పసిపిల్లలు మొదలుకొని పండు ముసలివారి వరకూ కామాంధుల చేతిలో బలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దేశాన్ని కుదిపేసిన `నిర్భయ` అత్యాచార ఘటన మొదలు తెలంగాణలో దిశ ఘటన వరకూ ఎన్నో రేప్ ఘటనలు కలచివేశాయి. కఠిన చట్టాలు చేసినా….శిక్షలు విధిస్తున్నా….కామాంధుల బుద్ధి మారకపోవడంతో అమాయక అబలలు, చిన్నారులు బలవుతూనే ఉన్నారు.
అయితే, ఈ దేశంలో మహిళలకే కాదు…జంతువులకు రక్షణ లేకుండా పోయిందని నిరూపించే ఘటన తాజాగా మహారాష్ట్రలో జరిగింది. ఇది నిజమా?…ఇలాంటి ఘటనలు మన దేశంలో జరిగాయా అని ముక్కున వేలేసుకోక మానరు. అడవిలో ఓ భారీ బల్లిపై నలుగురు మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటన వైరల్ అయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
మహారాష్ట్రలోని గోథానే గ్రామ సమీపంలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో నలుగురు వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. ఓ బెంగాల్ మానిటర్ లిజర్డ్ (భారీ బల్లి)పై ఆ నలుగురు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. గభా ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కోర్ జోన్లోకి ప్రవేశించిన నిందితులైన వేటగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, జనార్దన్ కామ్టేకర్, అక్షయ్ సునీల్ లు ఈ అకృత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఓ నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తున్న క్రమంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ భారీ బల్లిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వారు తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో అడవిలో తిరుగుతున్న వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో విషయం బయటపడింది. నిందితులు కొంకణ్ నుంచి కొల్హాపూర్ చందోలి గ్రామానికి వచ్చారని, వేట కోసం వారు అడవిలో చొరబడ్డారని అధికారులు తెలిపారు.
నిందితులను కోర్టులో హాజరుపరిచి చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం బెంగాల్ మానిటర్ లిజర్డ్ అరుదైన జాతి. నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఆఖరికి జంతువులకు కూడా రక్షణలేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.