సాధారణ ఎన్నికలలో దారుణ పరాజయం తర్వాత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాలలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికలకు ముందు చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. పలువురికి స్థాన చలనం తప్పలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి వారిని పాత స్థానాలకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గానికి ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త ఇన్చార్జ్ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ట్విస్ట్ ఉంది.. వైసీపీ రెడ్డి నేతలు ఇద్దరు బీసీలను బలి పశువులుగా మార్చే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.
2019 ఎన్నికలలో వైసీపీ నుంచి కనిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాక ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథితో వియ్యం అందుకున్నారు. ఇక గత ఎన్నికలలో నియోజకవర్గంలో ఏకంగా 46వేల ఓటింగ్ కలిగిన రెడ్డి సామాజిక వర్గం మధుసూదన్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే జగన్ ఆయనను కందుకూరుకు మార్చి.. హనుమంతునిపాడు జడ్పిటిసి గా ఉన్న దద్దాల నారాయణ యాదవ్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైసిపి వ్యతిరేక గాలులలో నారాయణ యాదవ్ ఓడిపోయారు. టిడిపి నుంచి పోటీ చేసిన ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే ఇప్పుడు ఎన్నికలలో ఓటమి తర్వాత నారాయణ యాదవ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో కనీసం నియోజకవర్గ పార్టీ కార్యాలయం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని.. అందుకే తన కార్యాలయాన్ని తన రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఉన్న ఆఫీసులోకి మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. నారాయణ యాదవ్ మామూలు జడ్పీటీసీ… ఆయనకు ఎమ్మెల్యే సీటు రావడమే చాలా ఎక్కువ… కనిగిరి నియోజకవర్గ వైసీపీలో రెడ్ల హవా ఎక్కువ. వీళ్లు చెప్పిందే వేదం… వీరు చెప్పినట్టు వైసీపీ ఎమ్మెల్యే వినాలి.. లేకపోతే అస్సలు గిట్టనివ్వరు.. జగన్ చెవిలో జోరీగలా ఊదుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాము చెప్పినట్టు వినడం లేదని రగిలిపోయిన వైసీపీ రెడ్లు అందరూ ఒక్కటై సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ యాదవ్‌ను కాదన్నారు. చివరకు జగన్ సైతం తన రెడ్లు చెప్పే మాటకే తలవగ్గి మామూలు జడ్పీటీసీగా ఉన్న నారాయణ యాదవ్‌కు సీటు ఇచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు మధుసూదన్ తిరిగి కనిగిరి ఇన్చార్జ్ ఇవ్వాలని కోరుతున్నారు. కనిగిరి వైసీపీకి కొత్త ఇన్చార్జి వస్తారన్న ప్రచారం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
నియోజకవర్గంలో గెలుపోటములను శాసించడంతోపాటు వైసీపీ రాజకీయాలలో కీలకంగా ఉండే రెడ్డి సామాజిక వర్గం మాత్రం మధుసూదన్ యాదవను పక్కనపెట్టాలని.. గత మూడు ఎన్నికలలోను వైసీపీ నుంచి బీసీ యాదవ సామాజిక వర్గానికి సీటు ఇచ్చినందున ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని వారంతా పట్టుబడుతున్నారు. మరి అంతిమంగా జగన్ నిర్ణయం ఎలా ఉంటుంది… రెడ్ల దెబ్బకు వైసీపీలో ఉన్న ఆ ఇద్దరు బీసీ నేతలు బలికాక తప్పదా ? అన్నది చూడాలి.