బీసీల్లో అందరూ బీసీలకు జై కొడతారన్న గ్యారెంటీ లేదు. బీసీల్లోనూ సామాజిక వర్గాల ఆధారంగా కొంత రాజకీయసర్దుబాటును కోరుకుంటారు. ఈ సర్దుబాటే.. ఇప్పుడు వైసీపీ నేతకు సెగ పెడుతోంది. ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలోనూ జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని పక్కన పెట్టిన వైసీపీ, పొరుగున ఉన్న పెడన నియోజకవర్గం నుంచి మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్‌ను తీసుకువచ్చి టికెట్ ఇచ్చింది. అయితే.. ఈ మార్పుతో బీసీలు ఆయనను గెలిపిస్తారని అంచనా వేసుకుని ఉండొచ్చు.
కానీ, బీసీల్లో ఈ బీసీలు వేరయా! అన్నట్టుగా పెనమలూరు నియోజకవర్గం పరిస్థితి ఉంది. పెనమలూరులో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీరు బీసీలే. ఇక, మంత్రి రమేష్ గౌడ సామాజిక వర్గం. దీంతో ఈయన కూడా బీసీనే. కానీ, ఈ నియోజకవర్గంలో వీరి ఓట్లు తక్కువగా ఉన్నాయని నాయకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఆది నుంచి కూడా ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీనినే వారు `సర్దుబాటు` అంటున్నారు. దరిమిలా.. యాదవ వర్గం.. గౌడ వర్గానికి మద్దతు పలకడం కష్టంగా మారుతోంది. జోగి రమేష్ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో యాదువులు ఆయనకు సహకరించడం అంత సులువు కాదని స్థానికులు చెబుతున్నారు.
ఇక, పార్థసారథి విషయాన్ని గమనిస్తే.. ఆయన వివాద రహితుడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు టికెట్ లేదని వైసీపీ చెప్పిన దరిమిలా.. ఆయన యాదవ వర్గాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించారు. తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం కమ్యూనిటీకి జరిగిన అన్యాయంగా ఆయన ప్రొజెక్టు చేయడంలో సఫలీకృతలయ్యారనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. అంటే.. తమ నాయకుడిని పక్కన పెట్టి.. అసలు నియోజకవర్గంతో సంబంధం లేదని జోగిని తమపై నెట్టారని యాదవులు చెబుతున్నారు.
పోనీ.. గౌడ సామాజిక వర్గం అంతా జోగికి అండగా ఉన్నా.. వీరికన్నా యాదవ ఓటు బ్యాంకు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. మరోవైపు.. టీడీపీ నాయకుడు.. బోడే ప్రసాద్ విషయంలో సానుభూతి పెరిగింది. స్థానిక నాయకుడు కావడం.. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీని, ప్రజలను అంటిపెట్టుకుని ఉండడంతో ఆయన వైపు మెజారిటీ సామాజిక వర్గాలు మొగ్గుచూపుతు న్నాయి. దీంతో వైసీపీ చేసిన ఈక్వేషన్ ఇక్కడ బెడిసి కొట్టే అవకాశం ఉందని వైసీపీ లోకల్ నేతలు అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా.. బీసీలే అయినా.. ఈ.. బీసీలు(యాదవులు) ఈక్వేషన్లో తేడా ఉంటుందని చెబుతున్నారు. ఇది మంత్రి జోగికి సెగపెడుతుండడం గమనార్హం.