సంచలనంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ మీద సంచలన పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిటీ క్రైం కంట్రోల్ బ్యూరో (సీసీబీ) వాయు వేగంతో పని చేస్తోంది. సాధారణంగా రతెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు.. అందునా హైప్రొఫైల్ కేసుల్లో చోటు చేసుకునే పరిణామాలతో పోలిస్తే.. బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ ను అక్కడి పోలీసులు డీల్ చేస్తున్న తీరు భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది.
ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా.. తమ వరకు వచ్చిన ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేసే విషయంలో వారు వ్యవహరిస్తున్న పారదర్శకత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసు వివరాలు చెప్పేందుకు వెనుకాడని తీరుతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు. విచారణను ఎదుర్కొంటున్న వారిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్నట్లుగా చెబుతున్నారు. వీరే కాక తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కూడా ఉన్నట్లు సమాచారం.
రేవ్ పార్టీలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వాసును ఇప్పటికే అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. మంత్రి కాకాణి పేరుతో ఉన్న కారుస్టిక్కరర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును హైదరాబాద్ కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన మంత్రి అనుచరుడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న అరుణ్ కుమార్ సెల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమతో సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న ఎనిమిది మంది మే 27న (సోమవారం) విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 86 మంది డ్రగ్స్ వాడినట్లుగా వైద్య పరీక్షల్లో బయటపడటం తెలిసిందే. డ్రగ్స్ వాడినట్లుగా పాజిటివ్ రిపోర్టులు వచ్చిన వారిలో 59 మంది పురుషులు.. 27 మంది యువతులు ఉన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ కేసు దర్యాప్తు సాగుతున్న వేగం చూస్తే.. రానున్నరోజుల్లో మరిన్ని సంచలన అంశాలు తెర మీదకు వచ్చే వీలుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఈ కేసులో కర్ణాటకకు చెందిన రాజకీయ నేతలు.. అక్కడి బడా వ్యక్తులు లేకపోవటంతో ఆ పోలీసులకు ఈ కేసు విచారణలో ఫ్రీ హ్యాండ్ లభించినట్లుగా చెబుతున్నారు.