బండ్ల గణేష్….టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన బండ్లన్న…అనతి కాలంలోనే బడా నిర్మాతగా ఎదిగారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్…ఆయనను దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అంతేకాదు, పొలిటికల్ గా కూడా పవన్ ను బండ్ల గణేష్ వెనకేసుకొస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు నేతలు పవన్ ను విమర్శించినప్పుడు వారికి బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్లు ఇచ్చిన సందర్భాలున్నాయి.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానిలను ఉద్దేశించి కూడా ఇటీవల బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సినిమా అయినా, రాజకీయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం బండ్ల గణేష్ నైజం. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన పలు వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదమయ్యాయి. అయినా, సరే బండ్ల గణేష్ మాత్రం తను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ లపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఓ ఈవెంట్లో వీరిద్దరూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఓ ఫోటోను షేర్ చేసిన బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం సరైన పద్ధతి కాదు అనే అర్థం వచ్చేలా ఆ ఫోటోపై పరోక్షంగా బండ్ల గణేష్ కామెంట్ చేశారు. అంతేకాదు, ఆ ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ పద్ధతిగా ఓ ఫంక్షన్లో కూర్చున్న మరో ఫోటోను షేర్ చేసి రెండిటిని కంపేర్ చేశారు బండ్ల గణేష్.
‘‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం… మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి… అది మన ధర్మం’’ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, బండ్ల గణేష్ ట్వీట్ పై డీజే టిల్లు, అడివి శేష్ లు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.