నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ కేసు తేనెతుట్టె మరోసారి కదిలిన సంగతి తెలిసిందే. ఈ సారి డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టిన ఈడీ అధికారులు పలువురు సెలబ్రిటీలకు నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే తొలి రోజు విచారణలో భాగంగా టాలీవుడ్ విలక్షణ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 10 గంటలపాటు పూరీని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. అయితే, పూరీని విచారణ జరుపుతున్న సమయంలోనే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అక్కడికి రావడం షాకింగ్ గా మారింది. పూరీ ఎంక్వయిరీ సమయంలో బండ్ల ఎంట్రీ ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
పూరీపై ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 2015నుంచి పూరీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు పరిశీలించారు. పూరీ విదేశీ లావాదేవీలపై ఆరా తీసిన అధికారులు మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్ల వ్యవహారం, ఆర్థిక లావాదేవీలపైనా కూపీ లాగుతున్నారని తెలుస్తోంది. పూరీకి సంబంధించిన 3 బ్యాంక్ ఖాతాలతోపాటు పూరీ సొంత బ్యానర్ అయిన వైష్ణో బ్యానర్, పూరీ భాగస్వామిగా ఉన్న పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రిపోర్టులను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గతంలో అరెస్టయిన నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా పీఎమ్ఎల్ఏ యాక్ట్ సెక్షన్ 3.4 ప్రకారం పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, పూరీని విచారణ జరుపుతున్న సమయంలో బండ్ల గణేశ్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గణేష్‌ను అధికారులు కార్యాలయానికి రప్పించారనే పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, బండ్ల గణేశ్ మాత్రం తనకు ఎటువంటి నోటీసులు రాలేదని, పూరీ తన స్నేహితుడు కాబట్టి కార్యాలయానికి వచ్చానని చెబుతున్నారు. తాను వక్కపొడి కూడా వేసుకోనని, తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు ఎందుకు ఇస్తారని గణేశ్ చెబుతున్నారు.ధర్మో రక్షితి రక్షిత: అంటూ కొటేషన్స్ ట్వీట్ చేస్తున్న బండ్ల గణేశ్…డ్రగ్స్ కేసులో తన పేరును లాగవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
కానీ, నిప్పు లేనిదే పొగరాదని, ఆర్థిక లావాదేవీల్లో బండ్ల గణేష్ పేరు లేనిదే పనిగట్టుకొని ఆయన ఈడీ విచారణ సమయంలో కార్యాలయానికి ఎందుకు వస్తారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసు విచారణలో పేర్లున్న వారితో మాట్లాడేందుకే టాలీవుడ్ సెలబ్రిటీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న తరుణంలో…ఏకంగా విచారణ జరుగుతున్న కార్యాలయానికి గణేష్ రావడం, పైగా తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉన్న పూరీని కలుసుకునేందుకు వచ్చానని చెప్పడం నమ్మశక్యంగా లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పూరీని కలవడానికి బండ్లకు వేరే చోటు…సమయం దొరకలేదా అంటూ చురకలంటిస్తున్నారు.