తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు, ఆయన ద్వారా ప్రయోజనం పొందిన వాళ్లే సరిగా స్పందించట్లేదని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడైనప్పటికీ.. చంద్రబాబు అంటే ఎంతో అభిమానం అని, దేశం గర్వించదగ్గ అలాంటి నేత అక్రమంగా అరెస్టయితే చాలామందికి పట్టట్లేదని బండ్ల అన్నాడు. బాబు అరెస్టుతో తాను వినాయక చవితి కూడా జరుపుకోలేదంటూ ఉద్వేగభరితంగా మాట్లాడాడు బండ్ల. కులం పేరు చెప్పకుండానే మా వాళ్లు అంటూ చంద్రబాబు సామాజిక వర్గం స్పందిస్తున్న తీరును ఆయన తప్పుబట్టాడు.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వాళ్లకు సిగ్గు శరం లేదు. అదే కానీ ఇంకో నాయకుడు కానీ, ఇంకో కమ్యూనిటీ వాడు అరెస్టయి ఉంటే అగ్గి గుగ్గిలమైపోయేది. మేం అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడ ఇక్కడ జెండాలు పట్టుకుని ఊపుతున్నాం కానీ. ఆయన ద్వారా లబ్ధి పొంది, ఆయన ద్వారా బతుకు తెచ్చుకుని ఎక్కడి నుంచో వచ్చి ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చుకుని కానీ.. హైదరాబాద్‌లో ఎంతోమంది చంద్రబాబు నాయుడి గారిని అడ్డం పెట్టుకుని ఆయన పేరుతో, ఆయన దీవెనలతో, ఆయన విజన్‌తో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న ఎవ్వరికీ చలనం లేదు. ఇక్కడ కేబీఆర్ పార్కులో, ఔటర్ రింగ్ రోడ్డులో, ఎక్కడో అమెరికాలో, న్యూజెర్సీలో, ఆస్ట్రేలియాలో జెండాలు పట్టుకుని ఊపడం కాదు.
చీమూ నెత్తురూ ఉంటే సొంతూళ్లకు వెళ్లండి. సొంతూళ్లకు వెళ్దాం పదండి. వాళ్ల ఊర్లో ధర్నాలు చేద్దాం. ఒక నెల రోజులు ఖాళీగా ఉంటే, ఉద్యోగం లేకపోతే ఏమైంది? కరోనా వచ్చినపుడు ఇంట్లో కూర్చోలేదా? చంద్రబాబు కంటే ఎక్కువా? మన తండ్రి ఎంతో చంద్రబాబు అంత. మీ నాన్నకే ఇలా జరిగితే, మీ అమ్మకే ఇలా జరిగితే.. కేబీఆర్ పార్కులో, ఔటర్ రింగ్ రోడ్లో జెండాలు ఊపుతామా? సొంతూళ్లకు వెళ్లాలి. అక్కడ బొడ్రాయి ముందు కూర్చుని ధర్నా చేయలేమా.. ‘వుయ్ ఆర్ విత్ చంద్రబాబు’ అనలేమా? ఏం అలా చేస్తే చంపేస్తారా? చచ్చిపోదాం.
చంద్రబాబు మన దేవుడి లాంటి వాడు. మన దేవుడు. రాష్ట్రానికి పెద్ద. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనొక విజనరీ. అలాంటి నాయకుడు రాజమండ్రి జైల్లో కష్టపడుతుంటే మనం అన్నమెలా తింటాం. చంద్రబాబు గారు త్వరలోనే బయటికి వస్తారు. రాష్ట్రాన్ని ఏలతారు. కానీ బయటికి వచ్చాక మీ వాళ్లెవరో మీ కోసం నిలబడేవాళ్లు ఎవరో తెలుసుకోండి. మిమ్మల్ని వాడుకునేవాళ్లను పక్కన పెట్టండి’’ అని బండ్ల గణేష్ అన్నాడు.