తెలంగాణలో మరోసారి వేడెక్కిన రాజకీయం బీజేపీ, టీఆర్ ఎస్ నేతల మధ్య మాటలు, భౌతిక దాడులకు కూడా దారితీస్తోంది. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతోందంటూ బీజేపీ కీలక నాయకుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కవిత తాజాగా రియాక్ట్ అయ్యారు. తరిమి కొడతాం బిడ్డా అని నిప్పులు చెరిగారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కూడా ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
ఇది జరిగిన కొద్ది సేపటికే.. అంటే, కవిత మీడియాతో మాట్లాడిన కొంత సేపటికే హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ నివాసంపై టీఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేశారు. కంకరరాళ్లను విసిరి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. మరికొందరు ఇంటి ప్రహరీ దాటి సెక్యూరిటీని కొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే, ఆ సమయంలోఎంపీ అర్వింద్ ఇంట్లోలేరు. దీంతో ఆవరణలోని కూల కుండీలను ధ్వంసం చేశారు.
అదేసమయంలో ఫర్నిచర్‌ను సైతం ధ్వంసం చేశారు. ఇక, ఈ ఘటనపై అర్వింద్ స్పందించారు. ‘కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాలపై హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ… బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు’’ అంటూ ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా? అని ఆయన కవితను ఉద్దేశించి మండిపడ్డారు.
‘‘అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని వాళ్లు ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారు. గడీల గూండా దాడులకు భయపడతామనుకుంటున్నారా? బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు. ప్రజలే టీఆర్ ఎస్ గూండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.