ఖమ్మంలో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ భారీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రజాకార్ల పార్టీ ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ కారు ఒవైసీ నడుపుతున్నారని, కేసీఆర్, ఒవైసీలతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని పుకార్లను కొట్టిపారేశారు.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయమని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, ఎంఐఎం 3జీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ అంటూ చురకలంటించారు. మోసం చేయడంలో దుబాయ్ శేఖర్ గా పేరున్న కేసీఆర్ పీహెచ్ డీ పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశఆరు. కేసీఆర్ కు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వలేదని, అందుకోసం తన కొడుకు అజయ్ రావు పేరును కల్వకుంట్ల తారక రామారావుగా మార్చి ఆయనను కాకా పట్టారని చురకలంటించారు. కేసీఆర్ పెగ్గులు వేసేటపుడు ఒక రకంగా, ముగిసిన తర్వాత మరో రకంగా మాట్లాడతారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
మొదటి పెగ్ కు ఇంటికో ఉద్యోగం, రెండో పెగ్ కు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడో పెగ్గుకు దళితులకు మూడెకరాలు, నాలుగో పెగ్గుకు దళిత బంధు అంటుంటారని ఎద్దేవా చేశారు. ఇక, ఐదో పెగ్గు వేయగానే..తాను అసలు ఆ మాటలు అనలేదని బుకాయిస్తుంటారని కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. రుణమాఫీ అంటూ రైతులను కేసీఆర్ మోసం చేశారని, నామ మాత్రంగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేశారని, వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడం ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు వేసినట్టేనని, అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబరు 17న జరుపుకుంటామని అన్నారు.