మాట్లాడే మాటల్ని కాస్తంత పద్దతిగా మాట్లాడితే టీ బీజేపీ బాధ్యుడు బండి సంజయ్ మాటలకు ఒక ఇమేజ్ ఉండేది. అందుకు భిన్నంగా వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే ఆయన మాటల కారణంగా ఆయనకు.. ఆయన మాటలకు పలువురు రియాక్టు అయ్యే విధానం కాస్తంత వేరుగా ఉంటుందని చెప్పాలి. అయితే.. మిగిలిన బీజేపీనేతలకు.. బండికి మధ్యనున్న తేడా ఏమంటే.. విషయం గురించి మాట్లాడుతూనే.. అందరి ద్రష్టిని ఆకర్షించేలా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి.
తాజాగా హైదరాబాద్ మహానగరంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్).. రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ సంస్థకు చెందిన ఉగ్ర అనుమానితులుగా పేర్కొనే అయిదుగురు మంగళవారం దొరికితే.. ఆరో వ్యక్తి బుధవారం దొరికేశాడు. ఈ క్రమంలో ఈ మాడ్యుల్ కు సూత్రధారిగా మహ్మద్ సలీంను చెబుతున్నారు. ఇతగాడు ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో డిపార్ట్ మెంట్ హెడ్ గా పని చేస్తున్న వైనం బయటకు వచ్చింది. అంతేకాదు.. ఒక డెంటల్ డాక్టర్.. మరో ఐటీ ఇంజనీర్ ఉండటం తెలిసిందే.
దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఎప్పటిలానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర అనుమానితుల్లో ఒకరు ఒక మెడికల్ కాలేజీలో హెచ్ వోడీ అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అది ఓవైసీకి చెందిన మెడికల్ కాలేజీలో పని చేసేటోడన్న ఆరోపణను ఆయన చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాత బస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు. ఉగ్రనేత ఓవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్ వోడీగా పని చేస్తున్నారని.. టెర్రరిస్టులకు సపోర్టు చేస్తానని గతంలో ఓవైసీ చెప్పుకున్నట్లుగా ఆరోపణలు చేశారు.
ఉగ్రవాదులకు.. రోహింగ్యాలకు మజ్లిస్ ఆశ్రయం ఇస్తుందన్న బండి సంజయ్.. ‘ఆరుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఐఎస్ఐ లాంటి సంస్థలకు పాతబస్తీలో షెల్టర్ ఇస్తున్నారు. అధికారాన్నికాపాడుకోవాలనే ధ్యాస తప్పించి దేశ భద్రత మీద బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు. అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ హింసించే పులకేశి.. మేం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ చాలా మంది ఓవర్ గా మాట్లాడారు. అందులో ట్విటర్ టిల్లు కూడా ఉన్నాడు’’ అంటూ ఒకే టైంలో తండ్రికొడుకులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం అధికారమే తప్పించి.. మరింకేమీ లేదన్నారు. శాంతిభద్రతలపై ఒక్క సమీక్ష కూడా కేసీఆర్ చేయటం లేదని.. ఉగ్ర కదలికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు.