సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించలేమని తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉదయనిది వ్యాఖ్యలపై ప్రధాని మోడీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పటికే ఉదయనిధఇ తల నరికి తెస్తే పది కోట్లు, కోటి రూపాయల నజరానా అంటూ హిందూ సంఘాల నేత, బీజేపీ ఎమ్మెల్యే ఆఫర్లు ఇచ్చారు. ఉదయనిది స్టాలిన్ పై కేసు నమోదు అయింది. స్టాలిన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తనకు అనుమతినివ్వాలంటూ బిజెపి ఫైర్ బ్రాండ్ నేత సుబ్రమణ్య స్వామి తమిళనాడు గవర్నర్ కు లేఖ కూడా రాశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తాను నిఖార్సయిన హిందువును అని చెప్పుకునే కేసీఆర్ ఉదయనిది వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, ఇటలీ ఇండియా కూటమి అని ఎద్దేవా చేశారు. ఉదయనిధి, రాహుల్ గాంధీ చెబితే వినాల్సిన ఖర్మ దేశ ప్రజలకు లేదని చెప్పారు. సనాతన ధర్మం జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఔరంగజేబు నుంచి బ్రిటిష్ వాళ్ల వరకు అలా ప్రయత్నించిన వాళ్లంతా సమాధుల్లో ఉన్నారని గుర్తు చేశారు.
నుపుర్ శర్మ, రాజాసింగ్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సంకలు గుద్దుకున్న పార్టీలు ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని ఆయన నిలదీశారు. రాముడు ఇంజనీరా? అని తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన మనవడు అంతమొందిస్తానని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి సోనియా గాంధీ కొడుకు మాట్లాడినా, స్టాలిన్ కొడుకు మాట్లాడినా ఒకటేనని అన్నారు. ఉదయనిది మాటలపై ఇండియా కూటమి తన వైఖరి స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలా చెప్పకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వార్నింగ్ ఇచ్చారు.