ఏపీలో సీఎం జగన్ హయాంలో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు, రథాలపై దాడులు పెరిగాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఉదాసీన వైఖరితోనే మరిన్ని దాడులు జరుగుతున్నాయని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారు. దీంతోపాటు, జగన్ పాలనలో ఏపీలో క్రిస్టియానిటీ, ఆ మత ప్రచారం ఎక్కువయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ గతంలో చేసిన షాకింగ్ కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మత రాజకీయాలపై సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ రాజ్యం నడుస్తోందని… తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోందని సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. హిందూ దేవాలయాల ఆదాయాన్ని జగన్ సర్కార్ ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు దారి మళ్లిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో ఒక మతానికి ఇక్కడి సీఎం కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని, ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. 2023లో తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోందని… బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కేవలం కాషాయ జెండానే రెపరెపలాడుతుందని అన్నారు. హైదరాబాదులోని బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. దీంతో, బండి సంజయ్ బోరబండకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో హిందూ ఓటర్లు చెంప దెబ్బ కొట్టినా పాలకులకు బుద్ధి రాలేదన్నారు. హిందూ దేవుళ్లను అవమానించిన ఎంఐఎంకు టీఆర్ఎస్ కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. ఒక మతం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ ఉత్సవాలు జరపడం లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు పెద్ద సమస్య కాదన్నారు. మత మార్పిడులపై ధర్మ యుద్ధం చేస్తామని , 80 శాతం మంది హిందువులు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారబోతున్నారని జోస్యం చెప్పారు.