తెలంగాణా బీజేపీలో అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేకులందరికీ పార్టీ అధిష్టానం గట్టి షాకిచ్చింది. రాబోయే ఎన్నికలు బండి నాయకత్వంలోనే జరుగుతుందని స్పష్టంగా చెప్పేసినట్లే. తొందరలోనే బండిని మారుస్తారని, నాయకత్వ మార్పు తప్పదని పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. వివిధ కారణాల వల్ల బండి వ్యతిరేకులు కూడా తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొందరేమో ఏకంగా ఢిల్లీకి వెళ్ళి పెద్ద నేతలతో భేటీలు కూడా జరుపుతున్నారు. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే బండి నాయకత్వం మార్పుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది.
పార్టీలోని సీనియర్లను సంతృప్తిపరిచే ఉద్దేశ్యంతో జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇపుడున్న కార్యవర్గానికి అదనంగా మరో 125 మందిని కలుపుతు అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. కొత్త+పాతల కార్యవర్గాన్ని కలిపిన అధిష్టానం అధ్యక్షుడిగా బండినే కంటిన్యు చేయబోతున్నట్లు చెప్పేసింది. నిజానికి అధ్యక్షుడిగా బండి పదవీకాలం పూర్తయిపోయింది. అయినా బండినే కంటిన్యు చేస్తున్నారంటే ఏమిటర్ధం ?
నరేంద్రమోడీ తెలంగాణాకు వచ్చినపుడు, ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినపుడు కూడా ప్రత్యేకించి బండిని అభినందించిన సందర్భాలున్నాయి. చాలాసార్లు మోడీ అభినందనలను అందుకున్న బండిని అద్యక్షపదవి నుండి తప్పించటం అంత వీజీకాదు. ఎందుకంటే బండి బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీలో ఒక జోష్ పెరిగింది. అంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగానే వ్యవహరించేవారు. కానీ బండి అలాకాకుండా ఏదో ఒక పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తు జనాల్లో బీజేపీ బలంగా ఉందనే కలరింగ్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీని విస్తరించేట్లుగా ప్రజాసంగ్రామయాత్ర పేరుతో చాలా పాదయాత్రలు చేశారు. ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఎంఐఎం టార్గెట్ గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తు వార్తల్లో నిలుస్తున్నారు. చాలా దూకుడుగా వెళుతున్న బండి లాంటి వాళ్ళే మోడీ, అమిత్ షా కు కావాల్సింది. బండి ఒంటెత్తు పోకడలు పోతున్నారన్నా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నా అధిష్టానం పట్టించుకోని కారణమిదే. మొత్తానికి బండి వ్యతిరేకులందరికీ అధిష్టానం పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి.