సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం, ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి ఆ వ్యవహారంపై స్పందించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని, ఆ ఒప్పందంలో తాను సంతకాలు చేయలేదని బాలినేని షాకింగ్ విషయాలు వెల్లడించారు. జగన్ దగ్గర మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో సోలార్ ఒప్పందంపై వార్తలు రావడంతో ఈ విషయం గురించి తనకు తెలిసిందని అన్నారు.
తన దగ్గరకు సెకీతో ఒప్పందం అని మాత్రమే వచ్చిందని, అదానీ కంపెనీ అని లేదని బాలినేని గుర్తు చేసుకున్నారు. అంత అర్జెంట్ గా సంతకం చేయాలంటూ అర్ధరాత్రి 12-1 గంటలకు ఒత్తిడి చేయడం, పలుమార్లు ఫోన్ చేయడంతో తనకు అనుమానం వచ్చిందని, అది తనకు నచ్చలేదని అన్నారు. ఇటువంటి వాటికి తాను దూరంగా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఒప్పందాన్ని కేబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారని వెల్లడించారు. ఎనర్జీ సెక్రటరీతో సీఎంవో, సీఎం గారు మాట్లాడేవారని, తనకు పెద్దగా సమాచారం ఉండేది కాదని అన్నారు.
కేబినెట్ లో చర్చించకుండానే యూనిట్ విద్యుత్ కు రూ.2.49 పైసలు చెల్లించేలా నిర్ణయించారని ఆరోపించారు. విద్యుత్ శాఖా మంత్రిగా సంబంధిత పత్రాలపై తాను సంతకం చేయలేదని చెప్పారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే అస్సలు క్షమించకూడదంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్ మంత్రివర్గంలో పూర్తి స్వేచ్ఛ ఉండేదని, జగన్ మంత్రివర్గంలో స్వేచ్ఛ ఉండేది కాదని, ఆ వాతావరణం లేదని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయాన్ని జగన్‌కు చెప్పానని, ప్రజా వ్యతిరేకతను జగన్ దృష్టికి తీసుకెళ్లేవాడినని, అది జగన్ కు నచ్చలేదని అన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలే చెబుతారా అని జగన్ తనతో అనేవారని గుర్తు చేసుకున్నారు. అకస్మాత్తుగా మంత్రివర్గం నుంచి తనను తొలగించడం బాధేసిందని, ఎందుకు తొలగించారో కారణం కూడా తెలియదని అన్నారు. కుటుంబ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకునేవాడిని కాదని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ మంత్రిగా ఫోన్ చేసినా సీఎండీలు స్పందించేవారు కాదని, వారు కాంట్రాక్టర్ల చేతిలో ఉండేవారని, మంత్రిగా ఉన్న తాను కాంట్రాక్టర్ చేతిలో ఉండాలా అని ప్రశ్నించానని, అందుకే మంత్రి పదవి నుంచి తనను తొలగించి ఉంటారని చెప్పారు.