ఆగ్రహంతో భగభగ మండే వ్యక్తిని పట్టుకొని ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది? అందులోకి తాను తప్పులు చేయకున్నా..తప్పులు చేస్తన్నట్లుగా ప్రశ్నలు అడిగితే ఒళ్లు మండుతుంది కదా? అందులోకి తనకు ఎదురవుతున్న వరుస అవమానాల గురించి మాట్లాడకుండా.. కేవలం దర్యాప్తు అధికారి మాదిరి ప్రశ్నలు సంధిస్తున్న వేళలో.. తన విశ్వరూపాన్ని శాంపిల్ గా చూపించిన బాలినేని దెబ్బకు ఐప్యాక్ కు చెందిన వ్యక్తికి సినిమా కనిపించిందంటున్నారు. సరైనోడు తగిలినప్పుడు ఇలానే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసును తాడేపల్లి సీఎంవోకు రావాలన్న ఆదేశం నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్న వేళలో తాడేపల్లిలోని జగన్ నివాసానికి బాలినేని చేరుకున్నారు. ఈ భేటీ కోసం మీడియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే.. ఆయన నోటి నుంచి ఒక్క మాట రాలేదు. సీఎంతో భేటీ తర్వాత కూడా మీడియా వైపునకు రాకుండా తన దారిన తాను వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ తో భేటీ సందర్భంగా ఏం జరిగింది? అన్న వివరాలు బయటకు వచ్చాయి. అయితే.. సీఎం జగన్ తో భేటీ కావటానికి ముందు చోటు చేసుకున్న వైనంపై ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాడేపల్లి సీఎం నివాసంలోకి వెళ్లినంతనే.. సీఎంవోకు చెందిన కీలక అధికారితో పాటు.. ఐప్యాక్ కు చెందిన వ్యక్తి బాలినేనితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో బాలినేని చేసిన వ్యాఖ్యలు.. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్ల ముఖం వేసినట్లుగా చెబుతున్నారు.
బాలినేని ఏమన్నారు?
– గత ఏడాది నన్ను మంత్రివర్గం నుంచి తొలగించినప్పుడు ఏం చెప్పారు?
– మంత్రి వర్గంలో లేకున్నా జిల్లాలో మీరే మంత్రి. మీకు ఆ గౌరవం ఉంటుందన్నారా? ఇప్పుడేం జరుగుతోంది?
– కనీసం నేను అడిగిన డీఎస్పీని కూడా ఇవ్వలేదు?
ఈ ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో.. ఇప్పుడు ఇచ్చిన డీఎస్పీ మీ మాట వింటారని సమాచారం ఉంది. అందుకే వేశామన్న మాటకు కాస్తంత ఘాటుగా రియాక్టు అయ్యారు బాలినేని. ‘నేను అడిగిన వాళ్లను కాకుండా మీరు వేసిన అధికారి నా మాట ఎలా వింటారు?’’ అన్న మాటతో వారు మిన్నకుండిపోయినట్లు చెబుతున్నారు.
సాధారణంగా సీఎంవో సదరు కీలక అధికారి.. ఐప్యాక్ అధికారి మాటలకు కీలక నేతలు సైతం సమాధానం చెప్పేందుకు ఆలోచిస్తారని.. అందుకు భిన్నంగా బాలినేని మాత్రం ముక్కుసూటి సమాధానాలు ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన మాటలతో సదరు ముఖ్యులకు బాలినేని చిన్నపాటి సినిమా చూపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.