వైసీపీ కీలక నాయకుడు, సీఎం జగన్‌కు వరుసకు మేనమామ అయ్యే.. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధినేత జగన్‌కు భారీ షాక్ ఇచ్చారు. తానకు సీఎం జగన్ ఇచ్చిన వైసీపీ రీజినల్ కో ఆర్టినేటర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇది నిజంగా పార్టీలో ఉరుములు లేని పిడుగు లాంటిదనే చెప్పాలి. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు. దీంతో అత్యంత కీలకమైన ప్రకాశం జిల్లాలో వైసీపీ అంతర్గత విభేదాలు.. భగ్గుమన్నట్టు అయింది. దీనివల్ల పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
బాలినేని గత ఏడాది కాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2019లో పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత.. బాలినేనికి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. అదేసమయంలో ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్సీ నాయకుడు ఆదిమూల పు సురేష్‌కు కూడా.. జగన్ మంత్రి పదవిని అప్పగించారు. అయితే.. గత ఏడాది రెండోసారి విస్తరించిన సమయంలో మంత్రి పదవి నుంచి బాలినేనిని సీఎం జగన్ తప్పించారు. అయితే.. తనను తప్పించి.. ఇదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడంపై బాలినేని నిప్పులు చెరిగారు.
ఆయనను కూడా తప్పించాలని.. తీవ్ర సమరం చేశారు. ఈ విషయంలో ఏకంగా.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. జోక్యం చేసుకుని.. అర్ధరాత్రి ఒంగోలుకు వెళ్లి బుజ్జగించారు. ఈ సమయంలో మంత్రి పదవికి దీటుగా.. జగన్ ఆయనను చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్‌కు.. జగన్ కేబినెట్లో రెండో సారి చోటు దక్కడంపై బాలినేని ఇప్పటికీ రగిలి పోతున్నారు. అంతేకాదు.. తనను తొక్కేస్తున్నారని. కూడా ఆయన బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు.
అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సభ నిర్వహించారు. ఈ సభకు రావాలని బాలినేని ప్రయత్నించారు. అయితే.. పోలీసులు ఆయనను అడ్డుకోవడం రచ్చకు దారితీసింది. దీని వెనుక మంత్రి సురేష్ ఉన్నారనేది బాలినేని వర్గం ఆరోపణ. ఇక, ఈ విషయంపై రెండో రోజే.. తాడేపల్లి ఆఫీస్‌కు బాలినేని ఫిర్యాదు చేశారు. అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తనను అడ్డుకున్న సీఐని కూడా బదిలీ చేయలేదు. దీంతో బాలినేని ప్రస్తుతం పార్టీ ఇచ్చిన కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారనే చర్చ సాగుతుండడం గమనార్హం.