ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి బాలినేని గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు దోషుల విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరికి నిరసనగా బాలినేని తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేయడం, డీజీపీకి లేఖ రాయడం సంచలనం రేపింది. తన రాజకీయ జీవితంలో పోలీసుల తీరు ఈ విధంగా ఎన్నడూ లేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కార్యాలయానికి వచ్చిన బాలినేని…సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డితో భేటీ అయ్యారు.
తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభ ఎప్పుడూ అనుభవించలేదని, ఎమ్మెల్యేకి తెలియకుండానే భూకబ్జా జరుగుతుందా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని బాలినేని అన్నారు. భూ కబ్జా కేసులో అసలు దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని ధనుంజయ రెడ్డిని బాలినేని ప్రశ్నించారని తెలుస్తోంది. తన అనుచరులున్నా చర్యలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోవడం లేదని, నిస్పాక్షికంగా వ్యవహరించాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో, ప్రభుత్వ అధికారుల దగ్గర తన మాటకు విలువ లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద బాలినేని వాపోయినట్లు తెలుస్తోంది.