బళ్లు ఓడలు కావడం.. ఓడలు బళ్లు కావడం అంటే.. ఇదేనా? పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి రావడం అంటే ఇదేనా? నాకు తిరుగులేదు… నా అంతవాడు లేడంటూ.. ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి, ఒంగో లు ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బాద్షా మాదిరిగా వెలుగొందారు. అయితే.. ఇటీవల ఏడాదిన్నరకుపైగా కాలంలో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం తగ్గిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
సీఎం జగన్ బాబాయి.. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి బాలినేనికి మధ్య రాజకీయంగా పొసగని విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. సీఎం జగన్‌కు సమీప బంధువులే అయినా.. ఇద్దరూ కూడా.. రాజకీయంగా కత్తులు నూరుకుంటున్నారు. ఈ పరిస్థితే.. తొలుత వైవీని పక్కన పెట్టేలా చేస్తే.. తర్వాత మారిన పరిణామాల్లో బాలినేనికి చుక్కలు చూపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు చక్రం తిప్పిన ఆయన తాను కోరుకున్న అధికారులను జిల్లాలో నియమించుకున్న బాలినేనికి ఇప్పుడు అడుగడుగునా ఎదురీతలే కనిపిస్తున్నాయి.
ఏడాదిన్నరగా ఎదురీతే :
– 2022 ఏప్రిల్‌లో మంత్రి వర్గం మార్పు చేసిన సమయంలో బాలినేనిని సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే, తనను పక్కన పెట్టినా ఫర్వాలేదు కానీ.. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆది మూలపు సురేష్‌కు మాత్రం మరోసారి మంత్రి పదవి ఇవ్వొద్దని బాలినేని పట్టు బట్టారని వైసీపీలో గట్టిగా టాక్ వినిపించింది. కానీ జగన్ ముందు బాలినేని వాదన ఎక్కడా పనిచేయలేదు. పైగా ఆదిమూలపు సురేష్‌కు జగన్ దగ్గర మరింత ప్రయార్టీ పెరిగింది.
– నాలుగు మాసాల కిందట మార్కాపురంలో సీఎం జగన్ పర్యటనకు వచ్చినప్పుడు.. బాలినేని కలుసుకు నేందుకు ప్రయత్నించారు.కానీ, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీనివెనుక మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారని బాహాటంగానే బాలినేని చెప్పుకొచ్చారు. దీనిని సీఎంవో వరకు తీసుకువెళ్లారు. కానీ, ఆయనకు ఇక్కడా స్వాంతన లభించలేదు.
+ ఒంగోలు రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఎక్కువైందని.. నిలువరించాలని కూడా బాలినేని చేసిన సూచనలు.. కోరిన అభ్యర్థనలు బుట్టదాఖలయ్యాయి.
+ ఇటీవల పరుచూరి నియోజకవర్గ ఇన్చార్జ్ నియామకం విషయంలోనూ బాలినేని చెప్పిన సూచనలను పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. బాలినేనికి ఇష్టం లేకపోయినా సీఎం జగన్ నమ్మిన ఆమంచినే అక్కడ ఇన్చార్జ్గా పెట్టారు. అదే సమయంలో సీఎం జగన్ అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వని పరిస్థితిని బాలినేని ఎదుర్కొంటు న్నారు.
+ మంత్రి పదవిని పక్కన పెట్టి.. కొన్ని జిల్లాలకు ఆయనను రీజినల్ కోఆర్డినేటర్‌గా బాలినేనిని నియమించారు. ఆయనను చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌కు జగన్ కేబినెట్లో రెండో సారి చోటు దక్కింది. దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.
+ తాజాగా భూముల వివాదానికి సంబంధించి ఎస్పీ, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు తనకు కనీసం సహకరించడం లేదన్నది బాలినేని వాదన. దీనిపై ఆయన సీఎంవో వరకు విషయాన్ని తీసుకువెళ్లారు. అయితే.. ఈ విషయంలో సీఎంవో కీలక అధికారి ధనుంజయ్‌రెడ్డి మాత్రమే బాలినేనితో చర్చలు జరిపారు. చివరకు మీరే సైలెంట్ అవ్వాలి.. అని చెప్పి చర్చలకు ముగింపు ఇచ్చారు.
+ ఇలా.. ఒకటి తర్వాత ఒకటి బాలినేనికి సొంత పార్టీలో సెగ పెరుగుతున్నదని ఆయన వర్గం బాహాటంగానే చెబుతున్న విషయం గమనార్హం. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.