ఈ టెక్ జమానాలో సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీడియాకున్న క్రెడిబిలిటీ సోషల్ మీడియాకు లేకపోయినా…జనానికి వేగంగా రీచ్ అయ్యే ఎబిలిటీ మాత్రం సోషల్ మీడియా సొంతం. అరచేతికి కవచంలా స్మార్ట్ ఫోన్లు మారిపోయిన ఈ టెక్ యుగంలో చాలామంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు సినీ సెలబ్రిటీలపై, పొలిటిషియన్లపై ఫేక్ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవారికి బాలయ్య బాబు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. అటువంటి వారిని తన పుర్రచేత్తో కొడితే దవడ పగిలిపోద్దంటూ హెచ్చరించారు అఖండ. ఈ రోజు ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడని, పేరు లేని, లొకేషన్ తెలియని అడ్రస్ లతో చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు.
బాలకృష్ణకి రవితేజకి పడదు, చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. ఏంటివన్నీ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తన లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందని, దొరికితే దవడ పగిలిపోద్దని మండిపడ్డారు. కానీ, అటువంటి వారికి చెక్ పెట్టేందుకు మనం చేయవలసింది ఒక్కటేనని, ఊరు.. పేరు చెప్పుకోలేని, ధైర్యంలేని ఈ వెధవలను క్షమిద్దామని బాలయ్యబాబు పిలుపునిచ్చారు. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్ స్టాపబుల్’ అవుతామని బాలయ్య చెప్పిన డైలాగుల ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.