ఓ వైపు చంద్రబాబు అరెస్టు..మరో వైపు హైకోర్టు, ఏసీబీ కోర్టులో విచారణ…ఇంకో వైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు…ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ క్రమంలోనే మొదటి రోజు సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు అరెస్టుకు నిరసిస్తూ దానిపై చర్చ జరగాలని టిడిపి సభ్యులు వాయిదా తీర్మానాన్ని కోరారు. అయితే, స్పీకర్ తమ్మినేని దానికి అనుమతించలేదు. దీంతో, స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అంబటికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. అంబటిపై మీసం మెలేసిన బాలయ్య తొడగొట్టి సవాల్ విసిరారు.
రా చూసుకుందాం అంటూ అంబటికి సవాల్ విసిరారు. దీంతో, బాలకృష్ణ పై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ తొలి తప్పిదం కాబట్టి వదిలేస్తున్నానని, ఇకపై అటువంటివి చేయకూడదని అన్నారు. మరోవైపు టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లను ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా సస్పెండ్ చేశారు.
ఇక, అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిల మధ్య చిట్ చాట్ జరిగింది. టీడీపీ హింస కోరుకుంటోందని నాని అనడంతో…తాను రాజ్యాంగం కోసం పనిచేస్తున్నానని బుచ్చయ్య చౌదరి అన్నారు. వైసీపీ సభ్యులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు.