టీడీపీ 41వ ఆవిర్భావ సభలో అన్న నందమూరి తారక రామారావు తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ ను వేనోళ్ల కీర్తించిన బాలయ్య బాబు…ఎన్టీఆర్ చిత్రాల వల్లే పాతతరం సినిమాలు బతికున్నాయని ప్రశంసించారు. తన సినిమాల్లో భక్తి రసాన్ని ఎన్టీఆర్ బతికించారని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించారని కొనియాడారు.
పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని…జానపదాల్లో ఆయన నటిస్తే జావళీలు పాడాయని పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ నటిస్తుంటే కళామతల్లి కళకళలాడిందని కనుల పండుగగా నవ్విందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చేయని పాత్ర లేదని ఆయన నటించని సినిమా లేదని ప్రతి పాత్రను అనువణువు నింపుకొని నటించిన ఘనత అన్నగారిదని కొనియాడారు. ప్రతి బిడ్డకు మట్టి గడ్డకు కూడా తాను తెలుగు వాడిని అని సగర్వంగా చెప్పుకునే ఆత్మవిశ్వాసాన్ని దమ్ము ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అంటూ గర్వంగా చెప్పారు.
తెలుగు రాజకీయాలలో ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ కు తర్వాత అని చెప్పుకోవాల్సిందే అంటూ ప్రశంసించారు. పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనని పేదల భవిష్యత్తుకు బంగారు భరోసా ఇచ్చిన అమ్మ కూడా ఆయనని మహిళలకు ఆర్థిక స్వాతంత్రం స్వావలంబన కల్పించిన అన్న కూడా ఆయనే అంటూ బాలయ్య…ఎన్టీఆర్ ఘనతను చాటిచెప్పారు. ఎన్నో పథకాలను సాహసోపేతంగా ప్రవేశపెట్టిన అన్నగారికి మరణం లేదని నిత్యం వెలిగే మహోన్నత దీపం ఆయన అని బాలయ్య అన్నారు.
ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన మహనీయుడు అని, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత అన్నగారిదేనని కీర్తించారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను తన బావ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చంద్రబాబును బాలయ్య బాబు ప్రశంసించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి ప్రజలు ఘనవిజయం అందించారని, తమ భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ పూనాలని బాలయ్య బాబు పిలుపునిచ్చారు. ఏపీలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. అన్నగారు వంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.