నటసింహం నందమూరి బాలకృష్ణ మద్యం సేవిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఫేవరెట్ బ్రాండ్ ఏంటని అడిగితే టక్కున వినపడే పేరు మాన్షన్ హౌస్. విదేశాలకు వెళ్లిన వెంట మాన్షన్ హౌస్ ను తీసుకెళ్లే రకం బాలయ్య. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో బాలయ్య హౌస్ చేసిన టాక్ షోకు కూడా సదరు లిక్కర్ కంపెనీ స్పాన్సర్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పమంటే.. బాలయ్య అంటే మాన్షన్ హౌస్, మాన్షన్ హౌస్ అంటే బాలయ్య. సదరు బ్రాండ్ తో బాలయ్యకు అంతటి బంధం ఉంది. ఇప్పుడు ఆ బంధం అనుబంధంగా మారింది.
ఇన్నాళ్లు మాన్షన్ హౌస్ కు అనధికారిక ప్రచారకర్తగా ఉన్న బాలయ్య.. ఇప్పుడు అధికారికంగా ప్రచారకర్త అయ్యారు. తాజాగా మాన్షన్ హౌస్ సరోగేట్ అడ్వర్టైజింగ్‌లో బాలయ్య నటించారు. చట్టపరంగా ఇబ్బందులు రాకుండా మాన్షన్ హౌస్ వాటర్ బాటిల్ అంటూ యాడ్ చేశారు. ఈ యాడ్‌కి సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. అయితే బాలయ్య ఒక సినీ నటుడు మాత్రమేకాదు.. ప్రజా ప్రతినిధి. గౌరవ ప్రదమైన శాసనసభ్యుడి పదవిలో ఉన్నారు. పైగా ఇటీవలె భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ను అందుకున్నారు.
అటువంటి బాలయ్య ఒక లిక్కర్ బ్రాండైయిన మాన్షన్ హౌస్ కు అంబాసిడర్‌గా మారడం, ఆ బ్రాండ్‌కి ప్రమోషన్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన బాలయ్య.. ఈ విధంగా మద్యం బ్రాండ్‌ను ప్రమోట్ చేసి యువతను చేడగోట్టేలా తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అది కూడా పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న కొద్ది రోజులకే బాలయ్య ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సామాన్య ప్రజలు కూడా ఒకింత షాక్ అవుతున్నాయి. లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకపోయినా.. మాన్షన్ హౌస్ సృష్టించిన అలజడికి బాలయ్యపై విమర్శలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. అయితే విమర్శలను పట్టించుకునే వ్యక్తిత్వం బాలయ్యది కాదు. ఆయనకు ఏది నచ్చితే అదే చేస్తేరు. ఏది చెప్పాలనుకుంటే అదే చెప్పేస్తారు.