రసవత్తరంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని భావించిన కమలా హారిస్ ఆశలను అడియాసలు చేస్తూ ట్రంప్ రెండోసారి అగ్రరాజ్యానికి అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే.. యూఎస్ ప్రెసిడెంట్ ఎలెక్షన్స్ లో ఓ ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. ఎలెక్షన్ పోలింగ్ లో భాగంగా ఓ ఓటర్ చేసిన పనితో నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు మారుమోగిపోతోంది.
సాధారణంగా మన ఇండియాలో ఈవీఎం పద్ధతిలో ఓవర్స్ ఓటు వేస్తారు. కానీ అమెరికాలో పోస్టల్ బ్యాలెట్ తోనే ఓటు వేయాలి. అయితే ఓ ఓటర్ తన ఓటింగ్ స్లిప్ పై బాలయ్యకే నా ఓటు అని రాసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు అధ్యక్ష రేసులో లేని వ్యక్తి, పైగా ఇండియాకు చెందిన వ్యక్తిని అమెరికా అధ్యకుడిగా చూడాలని కోరుకుంటూ ఓ ఓటర్ బాలయ్యకు ఓటు వేయడం విడ్డూరంగా మారింది.
అమెరికా ఎన్నికల చరిత్రలో ఇటువంటి ఓటు పడటం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఈ లెక్కన బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఐదు దశాబ్దాల నుంచి హీరోగా సత్తా చాటుతూ కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.