టాలీవుడ్ లోని అగ్రహీరోలలో ఒకరిగా నందమూరి నటసింహం బాలకృష్ణకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. అయితే, అభిమానులపై బాలయ్య కొన్ని సార్లు చేయిచేసుకున్న ఘటనలు వైరల్ అయ్యాయి. ఆ అభిమానులను బాలయ్య ఎందుకు మందలించారు…అన్న విషయం పట్టించుకోని వారు…ఆయన మందలించిన విషయాన్ని మాత్రం హైలైట్ చేశారు. అయితే, బాలయ్యను దగ్గర నుంచి చూసిన పూరీ జగన్నాథ్ వంటి డైరెక్టర్లు మాత్రం బాలయ్య మనసు వెన్న అని…కితాబిస్తుంటారు. అయితే, ఎవరెన్ని ప్రచారాలు చేసినా బాలయ్యపై ఆయన అభిమానుల ప్రేమాప్యాయతలు మాత్రం తగ్గలేదు.
ఇక, తన ఫ్యాన్స్ పై ఉన్న ప్రేమను బాలయ్య మరోసారి చాటుకున్నారు. గతంలో ఓ అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బాలయ్య…ఆ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్నూలు లో ఎన్బీకే 107 సినిమా షూటింగ్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. అయితే, గతంలో కర్నూలుకు చెందిన ఓ అభిమానిని కలుస్తానని బాలయ్య మాటిచ్చారు. ఆ మాటను గుర్తుపెట్టుకున్న బాలయ్య స్వయంగా ఆ అభిమాని కుటుంబాన్ని పిలిచి వారితో లంచ్ చేశారు.
వారితో ఆప్యాయంగా మాట్లాడిన బాలయ్య…ఎంతో సింపుల్ గా వారితో సమయం గడిపారు. దీంతో, ఇదీ మా బాలయ్య… జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. దీంతో, ఆ కుటుంబంతో కలిసి బాలయ్య భోంచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, తాజాగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో బాలయ్యపై గోపీచంద్ మలినేని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దీంతో, బాలయ్యను చూసేందుకు వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకున్నారు. బాలయ్య ఓపెన్ టాప్ జీపులో రావడం చూసిన అభిమానులు కేరింతలు, విజిల్స్ వేస్తూ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఓ బామ్మ అయితే బాలయ్యను చూసిన ఆనందంలో గట్టిగా విజిల్స్ వేసి డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా చిందులు వేయడం వైరల్ అయింది. ఇక, బాలయ్యతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడగా…ఏ మాత్రం విసుక్కో కుండా ఫోటోలు దిగే అవకాశం ఇచ్చారు బాలయ్య.
ఇక, తనను చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు భోజన ఏర్పాట్లు కూడా చేయించి తన మంచిమనసును మరోసారి చాటారు బాలయ్య బాబు. తన చిత్రం నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ తో మాట్లాడి అభిమానులందరికీ భోజనం పెట్టించిన బాలయ్య వెన్నలాంటి మనసుకు అభిమానులు ఫిదా అయ్యారు.