నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్టు చేయబోతోన్న టాక్ షో ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది. నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రారంభం కానున్న బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో కర్టన్ రైజర్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అంటూ అల్లు అరవింద్ ను ఉద్దేశించి చమత్కార ధోరణిలో కొనియాడారు బాలయ్య. అల్లు అరవింద్ మానస పుత్రిక ‘ఆహా’ ఓటీటీ అని, అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా ‘ఆహా’ను స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారని ప్రశంసించారు. తమ ఇంట్లోకి చొరవగా వచ్చే చనువు అల్లు రామలింగయ్యగారికి మాత్రమే ఉందని, అమ్మానాన్నల దగ్గర అల్లు వారికి అంత చనువు ఉండేదని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదని అన్నారు.
ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల శిల్పం అవుతుందని, ఎన్నో ఎత్తు పల్లాలు మనిషి జీవితంలో ఉంటాయని, వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్స్టాపబుల్’ అని బాలయ్య అన్నారు. ఆ కాన్సెప్ట్ నచ్చడంతోనే ఈ కార్యక్రమం చేయడానికి ఒప్పుకొన్నానని బాలయ్య అన్నారు. ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించానని, తనను ప్రేక్షకులు అన్నివేళలా ఆదరించారని అన్నారు. ఇంకా ఎంతో చేయాలన్న ప్రేరణను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారని అన్నారు.
ఈ టాక్ షో దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారనన్నారు. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించడం అని, అది ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని బాలయ్య చెప్పారు. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని, అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుందని చెప్పారు.
మనుషులుగా మనమంతా ఒకటేనని, బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడని, అలా ఆవిష్కరించే ప్రయత్నమే ‘అన్స్టాపపబుల్’ అని చెప్పారు. ఈ షోకు వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతానని, వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటానని బాలయ్య అన్నారు. మాటలతో వాళ్లను ట్విస్ట్ చేసి షోను రక్తి కట్టిస్తానని, త్వరలోనే షోలో కలుద్దామని బాలయ్య చెప్పారు.