విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను టీడీపీ, నందమూరి అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 28 నాటికి ఈ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడులు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య…అన్నగారికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని బాలయ్య అన్నారు.
“దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. మండల వ్యవస్థను తీసుకొచ్చారు. వెనుక బడిన సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచారు. మహిళ యూనివర్శిటీ, హెల్త్ యూనివర్శటీలు తీసుకొచ్చారు. ఎన్నో చారిత్రత్మక పథకాలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తికి మా కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు, టీడీపీ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నా.. ఎన్టీఆర్ కు భారత్న రత్న ఇవ్వాలి” అని బాలకృష్ణ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తుందని, సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎందరో రాజకీయనేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారని, దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మండల వ్యవస్థ, మహిళ యూనివర్శిటీ, వెనుకబడిన సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నందమూరి సుహాసినీ, సాయిబాబా, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.