టిడిపి సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నను ఏపీ సీఎం జగన్ కొంతకాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ఎపిసోడ్ తో ఈ కక్ష సాధింపునకు జగన్ తెర తీశారని టిడిపి నేతలు చాలాకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని చింతకాయల విజయ్ ఇంట్లో సిఐడి పోలీసులు ప్రవేశించడం, విజయ్ పిల్లలతో దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు తెల్లవారుజామున హడావిడిగా అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. ఇంటి కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారన్న ఆరోపణలపై అయ్యన్నపాత్రుని అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక, అయ్యన్నపాత్రుడు అరెస్టులకు నిరసనగా టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టిడిపి కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయ్యన్నపాత్రుడిని తక్షణమే విడుదల చేయాలని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఆందోళన, నిరసనలకు దిగిన టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేస్తున్నారు. మరోవైపు అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఆయన సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం దుస్తులు మార్చుకొని బయటికి వచ్చే అవకాశం కూడా తన భర్తకు కల్పించలేదని పద్మావతి మండిపడ్డారు.
చెప్పులు వేసుకునే టైం కూడా ఇవ్వకుండా తోసుకుంటూ లోపలికి వెళ్లారని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ఈ అరెస్టును ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.