టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, పరిస్థితులు కాస్త చక్కబడడంతో ఈనెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్రను తిరిగి మొదలుబెట్టారు. దీంతో, ఎవరు నడవమన్నారు, ఎందుకు పెట్టుకున్నారు అంటూ పాదయాత్రపై వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దీటుగా కౌంటర్ ఇచ్చారు.
మీ అల్లుడు నత్తి పకోడీని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి అంటూ జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కనిపించిన వాళ్లకు ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు యాత్ర ఎందుకు చేశాడో అడగాలని చురకలంటించారు. పాడెయాత్ర అంటూ నడవలేక కోర్టు వాయిదాల పేరుతో యాత్ర వాయిదా వేసుకోవడం మీ దొంగ అల్లుడికే చెల్లింది అంటూ సెటైర్లు వేశారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని అధికారం పోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నావు దొంగ సాయి అంటూ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.
3 నెలల తర్వాత ఏ దేశం పారిపోవాలా అని ప్లాన్ వేస్తున్నావట అంటూ విజయసాయిని ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొస్తామని, తిన్నదంతా కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వాగే ప్రతి కూతకు లెక్క సరిచేసి బొక్కలో వేస్తాం దొంగ సాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక యువగళం పాదయాత్రలో నడక భారమై లోకేష్ బిత్తర సవాళ్లు విసురుతున్నాడు అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. గాలికుంటు వ్యాధి సోకి నాలుక వాచిందేమో పరీక్షించుకో చినబాబు అంటూ విజయ సాయి షాకింగ్ కామెంట్ చేశారు. దీంతో, ఆ వ్యాఖ్యలకు అయ్యన్నపాత్రుడు ఘాటుగా బదులిచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలపై విజయసాయి స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.