ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందేనని.. అప్పుడు కానీ కేసులో వాస్తవాలు బయటకు రావని సీబీఐ స్పష్టం చేసింది. అంతేకాదు.. వివేకాను నరికి చంపిన గొడ్డలి ఎక్కడ ఉందో కేవలం అవినాష్‌రెడ్డికే తెలుసునని.. ఆ విషయాన్ని చెప్పడంలో దాట వేస్తున్నారని తెలిపింది. ఈ విషయాలకు తోడు హత్య పూర్వాపరాలు కూడా ఆయనకే తెలుసునని వ్యాఖ్యానించింది. అందుకే ఆయనను అరెస్ఉట చేసి.. కస్టడీకి తీసుకోకతప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఇటీవలే కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య దర్యాప్తుపై కీలక వివరాలను కౌంటర్లో పేర్కొంది.
వివేకానందరెడ్డి హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడుందో విచారణలో తెలుసుకోవాల్సి ఉందన్న సీబీఐ… హత్యకు ముందు నిందితులతో జరిగిన 4 కోట్ల లావాదేవీలపైనా ప్రశ్నిస్తామని తెలిపింది. హత్యకేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌తో అవినాష్‌రెడ్డికి ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలని… హత్య రోజు అవినాష్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ ఎందుకెళ్లాడో తేల్చాలని కౌంటర్లో పేర్కొంది. హత్య కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో, మార్చి 15న అవినాష్‌రెడ్డి ఎక్కడ ఉన్నారో నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది.అందుకే అరెస్టు తప్పదని తేల్చి చెప్పింది.
నేరాన్ని తనపై వేసుకుంటే 10 కోట్లు ఇస్తామంటూ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్ చేసినట్లు గంగాధర్‌రెడ్డి చెప్పారని… అందులో వాస్తవం ఎంతో తేల్చాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు నివేదించింది. అలాగే దస్తగిరిని ఓబుల్‌రెడ్డి, భరత్ యాదవ్ ఎందుకు కలిశారనే విషయంతోపాటు… వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని తెలుసుకుంటామని హైకోర్టుకు వివరించింది.
సాక్షాలు చెరిపివేతలో..
హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేసిన కుట్రలో అవినాష్‌రెడ్డి భాగమేనన్న సీబీఐ… దురుద్దేశపూర్వకంగానే దర్యాప్తునకు సహకరించట్లేదన్న స్పష్టంచేసింది. ఇటీవల విచారణ చేసినప్పుడు తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దాటవేశారని, అలాగే వాస్తవాలు చెప్పలేదని హైకోర్టుకు నివేదించింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాష్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారని వివరించింది. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలిపింది.
అవినాష్‌రెడ్డి బయట ఉంటే ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు భయపడుతున్నారని… అవినాష్‌రెడ్డి అనుచరుల వల్ల దర్యాప్తునకు ఆటంకం కలిగినట్లు కౌంటర్లో పేర్కొంది. సాక్షులను అవినాష్‌రెడ్డి ప్రభావితం చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది. అవినాష్‌రెడ్డికి నేరచరిత్ర ఉందన్న సీబీఐ… ఆయనపై 4 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. వివేకా హత్యలో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాల్లేవని సీబీఐ పునరుద్ఘాటించింది. షమీమ్‌ను వివేకా పెళ్లి చేసుకోవడం శివప్రకాష్‌రెడ్డికి ఇష్టం లేదని… అయితే షమీమ్‌తో పెళ్లికి, వివేకా హత్యకు సంబంధం లేదని స్పష్టంచేసింది.