టాలీవుడ్లో బహుముఖ ప్రజ్ఞ ఉన్న వ్యక్తుల్లో అవసరాల శ్రీనివాస్ ఒకడు. ‘అష్టాచెమ్మా’ చూసి అతను మంచి నటుడని మాత్రమే అనుకున్నాం. కానీ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో రచయితగా, నటుడిగా తన ప్రతిభను అతను చాటుకున్నాడు. ఈ రెండు చిత్రాల్లో అతడి డైలాగ్స్ ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రతిభ చూసేనేమో.. డిస్నీ సంస్థ తమ ‘అవతార్-2’ చిత్రానికి తెలుగులో సంభాషణలు అందించమని అవసరాల శ్రీనివాస్‌ను అడిగినట్లుంది.
అతను కూడా ఓకే చెప్పినట్లున్నాడు. ఈ సినిమాకు డైలాగ్స్ అవసరాల అని తెలిస్తే అందరూ ప్రత్యేక ఆసక్తితో చూస్తారనడంలో సందేహం లేదు. కాగా ఫేస్ బుక్‌లో ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమాకు డైలాగ్స్ అవసరాలనే అనే విషయాన్ని వెల్లడించాడు. కాగా మరో వ్యక్తి ‘‘పీకినట్టే అయితే’’ అంటూ ఈ పోస్టుకు స్పందించాడు. ఐతే తన గురించి పోస్టు పెట్టిన వ్యక్తి తన పేరును ట్యాగ్ చేయడంతో అవసరాల ఈ కామెంట్ చూసి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘పీకినట్టే అయితే’’ అనే కామెంట్ కింద ‘‘థ్యాంక్ యు’ అని కామెంట్ పెట్టాడు. తన గురించి ఎవరో విమర్శిస్తే స్పోర్టివ్‌గా తీసుకుని సింపుల్‌గా ఇలా ‘థ్యాంక్స్’ చెప్పడం అవసరాలకే చెల్లింది. దీంతో పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా కామెంట్లు పెట్టారు.
అవసరాలను కొనియాడారు. తన సినిమాల్లో కూడా అవసరాల మార్కు ఇలాగే ఉంటుంది. తాను హీరోగా నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాకు అతను చేసిన ప్రమోషన్ హైలైట్. ఇది బట్టతలతో ముడిపడ్డ సినిమా కాగా.. తన అసిస్టెంట్ ఒకరితో కలిసి ఒక డ్రామా ఆడాడు అవసరాల. తనకు నిజంగా బట్టతల ఉన్నట్లు, తనతో గొడవ పడి ఆ అసిస్టెంట్ తన విగ్గును బయటికి తీసి బట్టతలను బయటపెట్టినట్లు ఒక వీడియో తీసి దాన్ని వైరల్ చేశాడు. ఆ సంగతి పక్కన పెడితే ‘అవతార్-2’లో తన డైలాగ్స్‌తో అవసరాల ఎలా అలరిస్తాడో చూడాలి.