స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం నందమూరి, నారా కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచిన సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులంతా కలుసుకుని ఆనందంగా గడిపామని గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని చంద్రబాబు అన్నారు. ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఇక, చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి గారు లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని నారా లోకేశ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆమె మరణ సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, చిన్నమ్మ మృతి తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని, చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సంతాపం ప్రకటించారు.
కంఠమనేని ఉమామహేశ్వరి మృతి నేపథ్యంలో నందమూరి అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అన్నగారి కుటుంబానికి ఆగస్టు గండం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు నెల నందమూరి కుటుంబానికి అచ్చిరాలేదని అంటున్నారు. ఆగస్టు నెల పేరు వింటేనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లేదా టీడీపీ అభిమానులు భయపడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఈ సందర్భంగానే ఆగస్టు నెలలో నందమూరి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఘటనలను వారు గుర్తు చేసుకుంటున్నారు.
1984 ఆగస్టులో అన్నగారు నందమూరి తారక రామారావు హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లగా…నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ వెన్నుపోటుతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఎన్టీఆర్..తిరిగి నెల రోజులకే సీఎం అయ్యారు. 1995 ఆగస్టులో టీడీపీలో సంక్షోభం రావడం తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ణ నెల్లూరులో పెళ్లికి హాజరవుతూ 2019 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తాజాగా ఉమామహేశ్వరి ఆగస్టు1న ఆత్మహత్యకు పాల్పడడంతో నందమూరి కుటుంబానికి ఆగస్టు శాపం ఉందని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.
Comments 1