తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం సద్దుమణగక ముందే మరోసారి అయ్యన్న పేరు వార్తల్లో వినిపిస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అయ్యన్న ప్రసంగించారని ఆయనపై కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది.
అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేలా అయ్యన్న మాట్లాడారని ఏయూ జేఏసీ ఆరోపించింది. ఈ క్రమంలోనే అయ్యన్నపై విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో, అయ్యన్నకు పోలీసులు సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు గత రాత్రి నర్సీపట్నంలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో అయ్యన్న లేకపోవడంతో ఆయన పెద్ద కుమారుడు విజయ్‌తో మాట్లాడారు. ఆ నోటీసులు తనకివ్వాలని విజయ్ కోరినా ఇవ్వలేదు. అయ్యన్నకే నోటీసులిస్తామని పోలీసులు వెళ్లిపోయారు.
అంతకుముందు, అయ్యన్న పాత్రుడికి హైకోర్టు ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కూల్చేసిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించుకునేందుకు అనుమతించాలన్న అయ్యన్న అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది. అయ్యన్న ఇంటి ప్రహరీ గోడను అర్ధరాత్రి వేళ హఠాత్తుగా కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ ఇంటి గోడను ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేసిందని అయ్యన్న, ఆయన తనయులు ఆరోపించారు.