శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసరడంతో మొదలైన ఈ గొడవ తాజాగా హత్యాయత్నం కేసుల నమోదు వరకు వెళ్లింది. గాంధీపై పోలీసులకు కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో, గాంధీపై గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై, మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్ లపై కూడా కేసు నమోదైంది.
ఆంధ్రోళ్లు అంటూ గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు కాక రేపాయి. దీంతో, ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రాజేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే, ఆంధ్రా సెటిలర్లను బీఆర్ఎస్ కు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డారని, హైడ్రా అంటూ హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. హైదరాబాద్ కు బదులుగా అమరావతిలో పెట్టుబడులను డైవర్ట్ చేసే కుట్రలో రేవంత్ రెడ్డి భాగం అయ్యాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన స్థాయిని గుర్తించాడని, ఇక నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అని, తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు.