రాజు అనే టీడీపీ కార్యకర్తపై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలుకు నందిగం సురేష్ ను తరలించారు.
ఆల్రెడీ బెదిరింపులు, హత్యాయత్నంతోపాటు నందిగం సురేష్ పై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సురేష్ బెయిల్ ను దుర్వినియోగపరుస్తూ టీడీపీ కార్యకర్తపై దాడి చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మే 17న తుళ్లూరు మండలంలో టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు, అనుచరుడు మూకుమ్మడిగా దాడి చేశారని కేసు నమోదు అయింది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
తన భర్తపై హత్యాయత్నం జరిగిందని రాజు భార్య ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు రాజును కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి ఆ ముగ్గురు పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సురేష్ తో పాటు మిగిలిన వారిపై పోలీసులు విచారణ జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు వారిని మంగళగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
దీంతో, నందిగం సురేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బెయిల్ పై ఉన్న సురేష్ చేతులారా దానిని దుర్వినయోగం చేసుకొని జైలుకు వెళ్లారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.