పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ ఎత్తులు వేస్తున్న తరుణంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ పై ఎత్తులు వేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాను బెంగాలీనని…గుజరాతీలకు బెంగాల్ లో ఏం పని అంటూ దీదీ లోకల్ సెంటిమెంట్ ను రగులుస్తూ చేసిన ప్రకటన సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే తాజాగా నందిగ్రామ్ మమతా బెనర్జీపై దాడి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నామినేషన్ వేయడానికి నందిగ్రామ్ వచ్చిన మమత గుడిలో పూజ ముగించుకొని కారు ఎక్కబోతున్న సమయంలో కొంతమంది దాడి చేశారు. తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని మమతా తెలిపారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని నిలువరించారని తెలుస్తోంది. దీంతో నందిగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ. దీంతో, ఆమె తన నందిగ్రామ్ పర్యటన రద్దు చేసుకొని కోల్ కతా వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం నందిగ్రామ్ లోనే ఈ రాత్రికి దీదీ బస చేయాల్సి ఉంది.
నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పిన దీదీ… గాయపడిన తన కాళ్లను మీడియాకు చూపించారు. తన పర్యటన సందర్భంగా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించలేదని,సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఒక గుడిలో పూజలు నిర్వహించుకుని వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, ఈ దాడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మమత చెప్పారు. ఇటీవలే టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలోని చేరిన కీలక నేత సువేందు అధికారిపై నందిగ్రామ్ నుంచి దీదీ పోటీ చేస్తున్నారు.
నందిగ్రామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువేందు కుటుంబానికి గట్టి పట్టున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే నందిగ్రామ్ లో దాడి జరగడం చర్చనీయాంశమైంది. అయితే మమతా బెనర్జీపై దాడి ఘటన కల్పితమని, అదంతా నాటకమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో తమతో పోటీకి భయపడి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.