హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వాహనంపై వైసీపీ కార్యకర్త దాడి చేసిన ఘటన హిందూపురంలో సంచలనం రేపింది. నియోజకవర్గంలో ఓ టీడీపీ కార్యకర్త కూతురు వివాహ రిసెప్షన్ కు హాజరై వెళుతున్న బాలకృష్ణ వాహనంపై దాడి చేసేందుకు వైసీపీ కార్యకర్త ఒకరు ప్రయత్నించాడు. బాలయ్య కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించాడు.
అయితే, ఈ ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ కార్యకర్తను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, తన దగ్గరున్న కర్రను బాలయ్య కారుపైకి విసిరేసి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. దీంతో, ఆ కర్ర కారు అద్దంపై పడి పక్కనున్న ఎస్సై తలకు తాకింది. ఈ ఘటనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. బాలయ్యకు ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ దాడిని టీడీపీ నేతలు ఖండించారు.