ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన దాదాపు మూడునెలల తర్వాత రష్యా తన పరువు దక్కించుకున్నది. బుధవారం నాడు ఉక్రెయిన్లోని కీలకమైన తీరప్రాంత, ఓడరేవు నగరం మేరియుపోల్ పై సంపూర్ణంగా పట్టుసాధించింది. మేరియుపోల్ నగరాన్ని నూరుశాతం రష్యా సైన్యం తన ఆధీనంలోకి తీసేసుకున్నది. గతంలోనే ఈ నగరాన్ని తమ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే అప్పట్లో ఈ నగరంలోని కీలకమైన స్టీల్ ప్లాంటును మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయింది.
స్టీల్ ప్లాంటులో దాక్కున్న వందలాది ఉక్రెయిన్ సైనికులు రష్యాను తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే ఆ ప్రతిఘటనంతా అయిపోయి చివరకు ప్లాంటులోని సైనికులంతా లొంగిపోయారు. దాంతో మేరియుపోల్ నగరం పూర్తి రష్యా వశమైపోయింది. సముద్రజలాల ద్వారా ఉక్రెయిన్ కు ఇతర దేశాలకు మధ్యజరిగే వ్యాపారాలకు మేరియుపోల్ నగరం చాలా కీలకం. ఈ నగరం స్వాధీనంతో ఉక్రెయిన్లోని 80 శాతం ఓడరేవు నగరాలు, పట్టణాలను రష్యా సైన్యం ఆధీనంలోకి తీసుకున్నట్లయ్యింది.
ఒకవైపు మేరియుపోల్ నగరంపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతునే మరోవైపు రాజధాని కీవ్ నగరాన్ని నాలుగువైపులా రష్యా సైన్యం చుట్టిముట్టేసింది. కీవ్ పై ఈరోజే రేపు రష్యా దళాలు ఎటాక్ చేస్తాయన్న వాతావరణాన్ని రష్యా సృష్టించింది. దాంతో కీవ్ ను ఎలాగైనా రక్షించుకోవాలని, రాజధానిని చేజారిపోనివ్వకూడదన్న ఉద్దేశ్యంతో తన సైన్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీవ్ వైపు మళ్ళించారు. దాంతో మేరియుపోల్ విషయంలో సైన్యం దృష్టి తగ్గిపోవటంతో ఇదే అదునుగా రష్యా సైన్యం మొత్తం నగరాన్ని స్వాదీనం చేసేసుకుంది.
4.5 లక్షల జనాభా ఉండే మేరియుపోల్ నగరం రష్యా సైనికుల దాడుల కారణంగా 90 శాతం నాశనమైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రైవేటు భవనాలు, జనావాసాలు, ఆసుపత్రులు, పర్యాటక కేంద్రాలు, ప్రముఖ విద్యాసంస్ధలు, పబ్లిక్ ప్టేసెస్ ఇలా అవి ఇవీ అని కాకుండా మొత్తం నాశనమైపోయాయి. ఈ నగరాన్ని పునర్నిర్మాణానికి ప్రపంచదేశాలు తలా ఒక చేయివేసినా కనీసం 5-10 ఏళ్ళు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. లక్షలమంది నగరం విడిచి వెళ్ళిపోగా కనీసం లక్షమంది చనిపోయుంటారని అంచనా వేస్తున్నారు.