జగన్ పాలనలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని, ‘నాడు-నేడు’ పథకం ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇక, ఆరోగ్య శ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచామని, రోగాల సంఖ్యను కూడా పెంచామని చెబుతుంటారు. అయితే, ఇంత గొప్ప చెబుతున్న ప్రభుత్వం…ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలకు మాత్రం గత 6 నెలలుగా మొండి చెయ్యి చూపిస్తోంది. వారికి కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం షాకిచ్చింది. ఆరోగ్యశ్రీ బిల్లులు 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని ఆ సంఘం అధ్యక్షుడు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్పారు. 45 రోజుల్లో చెల్లించాల్సిన బిల్లులు 6 నెలలైనా చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రులపై వైద్య ఉపకరణాలు పంపిణీ చేసిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని, బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని చెప్పారు. ఈ పథకం ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని, బిల్లులు చెల్లించని నేపథ్యంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) హెచ్చరించింది. 2023 ఆగస్ట్ నుంచి రూ.1,500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వానికి ‘ఆశా’ లేఖ రాసింది. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సోమవారం లేఖ రాసింది.