తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఏపీలో ఇంకా కంటిన్యూ అవుతోంది. తెలుగు సినిమాకు మార్కెట్ ఉన్న బెంగళూరులోనూ థియేటర్లు మూసే ఉన్నాయి. ఇలాంటివేళ.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్నది ఒక ప్రశ్న. దీనికి సమాధానంగా జులై రెండో శుక్రవారం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు ఇలానే కంటిన్యూ అయితే.. మరికాస్త ముందుగా థియేటర్లు ఓపెన్ అయినా ఆశ్చర్యం అక్కర్లేదని చెబుతున్నారు.
థియేటర్లు ఓపెన్ చేస్తారు సరే.. మరి రిలీజ్ చేసే ధైర్యం ఎవరికి ఉందన్నది ఇప్పుడు మరో ప్రశ్న. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు రీఓపెన్ చేయటం.. ప్రేక్షకులు ధైర్యంగా సినిమాహాళ్లకు వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆ అగ్నిపరీక్షకు సిద్ధమయ్యే సినిమాలు ఏమిటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
మొదటి వేవ్ అనంతరం థియేటర్లు ఓపెన్ చేసినప్పుడు విడుదలైన మొదటి స్టార్ హీరో మూవీ క్రాక్. అనూహ్యంగా ఈ సినిమాకు మంచి పేరు రావటంతో పాటు కమర్షియల్ గా హిట్ అయ్యింది.చాలా కాలం తర్వాత థియేటర్లు కళకళలాడిన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి మనోధైర్యాన్నిఇచ్చిన మూవీగా క్రాక్ నిలుస్తుంది.
ఇప్పుడు ఆ సినిమా బాటలో నడిచేందుకు గోపీచంద్ మూవీ ఆరడుగుల బుల్లెట్ సిద్ధమవుతోందన్న మాట వినిపిస్తోంది. తెలుగు సినిమాకు సరికొత్త యాక్షన్ ను పరిచయం చేసిన బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ సాంకేతిక కారణాలతో ఆగింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నాలుగేళ్ల క్రితమే విడుదల కావాల్సింది.
ఒకదశలో ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ పాం మీద విడుదల చేస్తారని టాక్ వచ్చినా.. అలా జరగదంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్లు రీఓపెన్ అయిన వెంటనే.. వచ్చే స్టార్ హీరో మూవీ ఆరడుగుల బుల్లెట్ గా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చిత్ర యూనిట్ చేస్తున్నట్లు సమాచారం. క్రాక్ బాటలో నడిచి తమకు మంచి విజయాన్ని అందిస్తుందని.. ఇప్పటివరకు పడిన కష్టాలకు పుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.