ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తమ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు సమసిపోయేలా లేవని, ఈ కారణంతోనే విడాకులు తీసుకుంటున్నామని సైరాబాను చెప్పారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని, గోప్యతను గౌరవించాలని సైరా కోరారని ఆమె తరఫు లాయర్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా తన విడాకుల వ్యవహారంపై ఏఆర్ రెహమాన్ స్పందించారు.
తామిద్దరం 30 ఏళ్ల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నామని రెహమాన్ అన్నారు. అయితే, దురదృష్టవశాత్తు అది జరగలేదని, తాము ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలచిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి ముక్కలైన హృదయాలను చూసి ఆ దేవుడు కూడా భయపడి ఉంటాడని, ఆ మొక్కలు ఎప్పటికీ కలవవు అని భావించి ఉంటాడని రెహమాన్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అయితే, ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన స్నేహితులకు, బంధువులకు కృతజ్ఞతలు చెప్పారు. తమ ప్రైవసీని గౌరవిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు.
ఇక, రెహమాన్, సైరాలు విడాకులు తీసుకోవడంపై వారి పిల్లలు స్పందించారు. ఈ విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవంగా వ్యవహరించిన వారందరికీ ధన్యవాదాలు అని రహమాన్ కూతురు ఖతీజా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమ కుటుంబ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామని, తమను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ఖతీజా, అమీన్ పోస్ట్ చేశారు.