ఐదేళ్ల అనాదరణ తర్వాత అమరావతికి కొత్త కళ రానుంది. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్న హామీ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లుగా చెబుతున్నారు. పదేళ్ల క్రితం ఏపీ రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు సర్కారు.. అప్పట్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు భవనాల్ని రూపొందించింది. దశల వారీగా అమరావతి నిర్మాణాన్ని చెప్పటేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే..తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిలో తీసుకున్న నిర్ణయం అశనిపాతంగా మారింది. గడిచిన ఐదేళ్లుగా అమరావతి స్థానే మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు.. రాజధానిగా అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలతో బ్రాండ్ అమరావతికి భారీ డ్యామేజ్ జరిగింది.
ఇలాంటి వేళలో మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువు తీరింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి రాజధాని అమరావతి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో దిక్కు తోచని పరిస్థితి. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు అమరావతి డెవలప్ మెంట్ కు అవసరమైన నిధుల కేటాయింపు కష్టసాధ్యంగా మారిన వేళ.. కేంద్రం నుంచి తాజాగా లభించిన బడ్జెట్ దన్ను అమరావతి రూపురేఖల్ని మార్చేలా చేయనుంది.
ఏడాది వ్యవధిలో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం.. ఏపీ రాజధాని నిర్మాణాన్ని జెట్ స్పీడ్ తో దూసుకెళ్లేలా చేయనుందనన వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. అవసరమైతే అమరావతికి మరింత ఎక్కువ సాయాన్ని ఏడాది వ్యవధిలో ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్న అంశాన్ని చెప్పటం అమరావతికి మరింత అనుకూలంగా మారనుంది. తాజా బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదా.. అధికార యంత్రాంగం మీదా ఉంది.
రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ.. కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్ల నిధులను ఖర్చు చేయటం.. అవసరమైతే మరిన్ని నిధుల దిశగా అడుగులు వేయటం ద్వారా ఇన్నాళ్లు జరిగిన నష్టాన్ని అంతో ఇంతో పూడ్చుకోవటంతో పాటు.. ఏపీ రాజధానికి కొత్త శక్తిని ఇస్తుందని చెప్పొచ్చు. కేంద్రం ఇస్తానన్న రూ.15 వేల కోట్లను ఏడాది కంటే తక్కువ సమయంలో ఖర్చు చేయగలిగితే.. ఏడాది తర్వాత ఇదే సమయానికి అమరావతికి కొత్త రూపు ఖాయమని చెప్పాలి.
ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో అమరావతి అడవిలా మారింది. ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే స్వల్ప వ్యవధిలోనే అమరావతి రోడ్లు.. వీధి దీపాల ఏర్పాట్లతో పాటు.. వందకు పైగా ప్రొక్లెయిన్లతో చెత్తకుప్పల్ని క్లియర్ చేయటం లాంటి ఎన్నో పనుల్ని సినిమాల్లో చూపించినట్లుగా వాయు వేగంతో పూర్తి చేయటం.. ప్రమాణస్వీకారానికి రోజు ముందుగానే ఒక షేప్ లోకి తీసుకురావటం తెలిసిందే.
రాజధాని అమరావతి మొత్తంలో కంప చెట్లను తొలగించేందుకే రూ.36 కోట్లు ఖర్చు కానుంది. మధ్యలో నిలిచిన రోడ్లు.. అంతర్గత డ్రెయిన్లు.. ఇతర మౌలిక వసతులతో పాటు.. మధ్యలో నిలిచిన నిర్మాణాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కేంద్రం చేసిన బడ్జెట్ ప్రకటనతో నిధుల కొరత సమస్య ఇప్పుడు తగ్గనుంది. 2014 నాటి చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని పనులు చేసి.. వాటి చెల్లింపులు రూ.1300 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటి పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారి కష్టాలు తీరటంతో పాటు.. అమరావతికి కేంద్రం అండ ఉందన్నది సానుకూలంగా మారనుంది. పెండింగ్ బకాయిల చెల్లింపుతో రెట్టించిన ఉత్సాహంతో రాజధాని పనులు జరిగే వీలుంది. మొత్తంగా రానున్న ఆర్నెల్లు అమరావతికి అత్యంత కీలకంగా మారనుంది.
గతంలో ఆగిన పనులు తిరిగి పూర్తి చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయటానికి మరో నెల రోజులు తీసుకున్నా.. డిసెంబరు నాటికి అమరావతి పనులు ఒక షేప్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో అమరావతికి కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో పనుల్ని ఎంత వేగంగా నిర్వహించాలన్న అంశంపై చంద్రబాబు పాలనా అనుభవం అక్కరకు రానుంది. మొత్తంగా రానున్న ఆర్నెల్లలో అమరావతి మరింత వెలిగిపోవటం ఖాయం. ఆ వెలుగుల్లో ఏపీ రాష్ట్రం మరింత మెరిసిపోయేలా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కారు మీద ఉందని చెప్పక తప్పదు.