ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారని.. ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. “వాళ్లను బయటకు నెట్టేయండి“ అని.. మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై తాము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
పెరిగిన ధరలపై టీడీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకరోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ… వారిని బయటకు తోసేయండంటూ మార్షల్స్‌కు ఆదేశాలు జారీ చేశారని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు.
మొత్తం 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నిత్యావసర ధరలపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ‘‘బాదుడే బాదుడు’’ అంటూ నినాదాలు చేశారు. పెరిగిన చార్జీలు, పన్నులపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థిత చోటు చేసుకోవడంతో… స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు ప్రతీరోజు ఇదొక అలవాటుగా మారిందని. మీ దుష్ప్రవర్తనకు సస్పెండ్ చేస్తున్నా. ప్రతి రోజు ఇదొక వ్యాపకం అయిపోయిందా మీకు. ఇంతకంటే వ్యాపకం లేదా మీకు’’ అని మండిపడ్డారు. ‘‘ఫుల్ దెమ్ అవుట్’’ అంటూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు.
స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహించారు. మార్షల్స్‌తో ఎలా బయటకు పంపుతారంటూ మండిపడ్డారు. దీనితో స్పీకర్ స్పందిస్తూ ‘‘దె ఆర్ మార్షల్స్ ఆస్ ద స్పీకర్ ఆయామ్ డిక్లరింగ్. వన్స్ అయామ్ డిక్లేర్ యు షుడ్ నాట్ టేక్ ఎనీ మోర్ హియర్. తీసుకెళ్లిండి’’ అంటూ మార్షల్స్‌ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు.
అసెంబ్లీ ప్రవర్తన నియమావళి సబ్ రూల్ 2 ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చిన్నరాజప్ప, గండ్ర వెంకటరెడ్డి, జోగేశ్వరావు , పయ్యావుల కేశవ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లు సస్పెండ్ అయ్యారు. అయితే.. స్పీకర్ అలా దురుసుగా వ్యవహరించడం పట్ల టీడీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.