ఏపీ ఫలితాలు చూసి దేశమే షాకవుతుంది…విజయవాడలోని ఐ ప్యాక్ టీంతో భేటీ అయిన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓట్ల శాతం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనే అంచనాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరోవైపు.. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. కానీ, అందరూ నర్మగర్భంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూన్ 4వ తేదీన వచ్చే ఏపీ ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందని చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో సీట్లు వస్తాయని తెలిపారు. 2019లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని చెప్పిన జగన్.. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అంతకుమించిన సంఖ్యలో సీట్లు రాబోతున్నట్టు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు మరింత సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్టు చెప్పారు. 151కి మించి అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు.
ఇదేసమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలకు భిన్నంగా ఫలితం రాబోతున్నట్టు తెలిపారు. తాజాగా విజయవాడకు వచ్చిన సీఎం జగన్.. వైసీపీకి రాజకీయ సేవలు అందించిన ఐప్యాక్ టీంతో ఆయన ముచ్చటించారు. వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఐప్యాక్ టీం చేసిన కృషిని ఆయన కొనియాడారు.
గతంలో 151 సీట్లు వస్తాయని ఎవరూ అనుకోలేదని.. వచ్చిన తర్వాత కూడా ఎవరూ నమ్మలేదన్నారు. ఈ సారి అంతకన్నా ఎక్కువ సీట్లలోనే విజయం దక్కించుకుంటున్నట్టు తెలిపారు. సుపరిపాలనను చూసి ప్రజలు మద్దతిచ్చారని జగన్ చెప్పారు. మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నట్టు తెలిపారు. అయితే, జగన్ చెప్పినట్లు ఏపీ ఫలితాలు చూసి దేశమంతా షాకవుతుందని, అయితే, అది కూటమి అఖండ విజయం చూసి అని కూటమి మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.