తప్పు చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిందే. అయితే.. కొన్నిసార్లు పోలీసులు చేసే తప్పుల కారణంగా తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా రిమాండ్ లేకుండా తప్పించుకునే అవకాశం లభిస్తుంది.తాజాగా గుంటూరు పోలీసుల తీరు ఇదే రీతిలో ఉంది. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేసే ధోరణి ఎక్కువైంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నచ్చకుంటే చాలు.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా పోస్టులు పెట్టేస్తున్నారు. ఇదే తీరులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక మహిళ అనుచిత పోస్టు పెట్టారు. దీనిపై ఫిర్యాదు అందింది. అయితే.. చేసిన తప్పునకు తగ్గట్లు వ్యవహరించాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అతిని ప్రదర్శించారు.
ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా ఉన్న పోస్టుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో గుంటూరు పోలీసులు అవసరానికి మించిన దూకుడు ప్రదర్శించారు. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిన వారు.. అందుకు భిన్నంగా హడావుడిగా పోస్టు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ శివపార్వతిగా.. ఆమె తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
స్కిల్ స్కాం ఆరోపణలతో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రిని నిందిస్తూ ఆమె పోస్టు పెట్టారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా శివపార్వతిపై ఐపీసీ 153, 502, 504, 505(2) కింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. అయితే.. తనకు ఆరోగ్యం బాగా లేదని.. తర్వాత స్టేషన్ కు వస్తానని చెప్పినా.. అందుకు కుదరదని చెప్పిన పోలీసులు ఆమెను రిమాండ్ చేయనున్నట్లు చెప్పారు.
దీంతో.. ఆమె అరెస్టు అక్రమమని పేర్కొంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. చట్టం ప్రకారం ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష కలిగిన నేరారోపణలు ఉన్న కేసులో.. ముందుగా నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుంది. కానీ.. అదేమీ లేకుండా అరెస్టు చేసిన తీరును న్యాయమూర్తి తప్పు పట్టారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో నిందితురాలిని రిమాండ్ కు పెట్టటం ఏమిటి? 41ఏ నోటీసులు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. రిమాండ్ కు పెట్టిన ఎస్ ఐను కోర్టుకు పిలవాలని ఆదేశించారు.
పోస్టు తాను పెట్టినట్లుగా ఒప్పుకున్న శివపార్వతిని రిమాండ్ కు న్యాయమూర్తి నో చెప్పారు. సొంత పూచీకత్తు మీద విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల ఆరు లోపు రూ.5వేలు విలువైన రెండు బాండ్లను సమర్పించాలని పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే.. తప్పు చేసినప్పటికీ.. తగిన శిక్ష పడేలా సెక్షన్లు పెట్టే విషయంలో పోలీసుల తొందరపాటును పలువురు తప్పు పడుతున్నారు.