- సీఎస్‌గా ఉన్నప్పుడు నిబంధనలకు పాతర
- రంగుల విషయంలో తప్పుటడుగులు
- ఎన్నికల కమిషనర్ అయ్యాక
- సుప్రీం తీర్పుకే వక్రభాష్యం
- నీలం సాహ్నికి హైకోర్టు చీవాట్లు
రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. ఆనక రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
జగన్ ప్రభుత్వం చెప్పినట్లే చేస్తున్నారని.. నియమ నిబంధనలను తుంగలో తొక్కడమే గాక.. కోర్టు తీర్పులకు కూడా ఆమె వక్రభాష్యాలు చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తూ.. సీఎం జగన్మోహన్రెడ్డి వినతిపై రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా వచ్చిన ఆమె.. న్యాయస్థానం ఉత్తర్వులను ఖాతరు చేయనందుకు రెండు సార్లు హైకోర్టు బోనెక్కాల్సి వచ్చింది.
ఇప్పుడు అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నా.. సుప్రీంకోర్టు తీర్పునకు సైతం సొంత భాష్యం చెప్పే సాహసానికి ఒడిగట్టారు. మండల, జిల్లా పరిషత ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తనకు నచ్చినట్లు వర్తింపజేసుకున్నారు.
నాలుగు వారాలపాటు కోడ్ అమలు చేయాలని గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును తోసిరాజని.. కేవలం పదిరోజులే గడువిచ్చి ఆ ఎన్నికలను నిర్వహించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలు చెల్లవని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజునే… ఆగమేఘాల మీద ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నీలం సాహ్ని తీరును తీవ్ర పదజాలంతో విమర్శించింది.
‘ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని… నాలుగు వారాలపాటు కోడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలి.
అందుకే.. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి నాలుగు వారాలు కోడ్ అమలులో ఉండాలని సుప్రీంకోర్టు చాలా సూటిగా, స్పష్టంగా చెప్పింది. ఇంగ్లీషు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం తెలిసిన సామాన్యులకు కూడా ఆ ఆదేశం సులువుగా అర్థమవుతుంది.
కానీ.. అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారిగా, చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ అయిన ఆమె ఇంత సరళమైన ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం చిత్రంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల కమిషనర్ పోస్టులో కొనసాగేందుకు అర్హురాలేనా, ఆ పదవికి ఆమె తగిన వారేనా అనే సందేహం తలెత్తుతోంది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యవహారంలో ఎస్ఈసీ, ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య గౌరవాన్ని దిగజార్చడం తప్ప మరొకటి కాదని.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం అంతిమంగా నిరంకుశాధికారానికి, నియంతృత్వానికి దారి తీస్తుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ అధికార పరిధికి లోబడి వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ… కోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి వ్యవహరించారని.. అందుకే ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నామని తెలిపింది. ‘ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చారు. 8వ తేదీన పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. పది రోజులకే కోడ్ వ్యవధి కుదించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు పూర్తి విరుద్ధం. ఇది తిరుగులేని వాస్తవం. ఈ ఆకస్మిక, విపరీత నిర్ణయంతో ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఎన్నికల కమిషనర్ చర్య ప్రజాస్వామ్య విధానం నుంచి పక్కకు తప్పుకోవడంగానే భావించవచ్చు. దీనినే నియంతృత్వం, అప్రజాస్వామికం అని కూడా పిలవొచ్చు. నిజానికి… సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల కమిషనర్, కార్యదర్శికి సరైనవిధంగా అర్థంకాకపోవడానికి తగిన కారణాలేవీ కనిపించడంలేదు.
వారు తమ బుద్ధిని ఉపయోగించకపోవడమొక్కటే దీనికి కారణం’ అని కటువుగా వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పును సమగ్రంగా, స్థూలంగా చదివి అర్థం చేసుకోవాలని.. అక్కడో ముక్క, ఇక్కడో ముక్క చదవకూడదని.. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఏర్పడిన చట్టాలకు అతీతంగా, ఊహకు సైతం అందని విధంగా నీలం సాహ్ని వైఖరి ఉందని పేర్కొంది.
‘మాకు అలా అర్థమైంది’ అంటూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ను ఆమోదించలేమని స్పష్టం చేసింది. ‘సాధారణంగా తమ కెరీర్లో ప్రతిభాపాటవాలతో సమర్థులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శి, అంతకంటే ఎక్కువ హోదాలో నియమితులవుతారు.
వీరు భయ పక్షపాతాల్లేకుండా పరిపాలన సాగిస్తారని ఆశిస్తాం. అలాగే ఒక ప్రభుత్వంలో అధికారిగా వ్యవహరించిన వారి సామర్థ్యం, అవగాహన ఆధారంగా ఎన్నికల కమిషనర్ వంటి పోస్టుల్లో నియమిస్తారు.
అలాంటి ఎన్నికల కమిషనర్‌కు.. సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల స్ఫూర్తి అర్థం కాలేదంటే.. అది ఎందుకో, దానికి కారణాలేమిటో ఆమెకే స్పష్టంగా తెలియాలి’ అని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు నీలం ప్రతిభాపాటవాలనే ప్రశ్నిస్తున్నాయి.
సీఎస్‌గా రెండు సార్లు పొడిగింపు తెచ్చుకున్న ఆమె రిటైర్ కాగానే జగన్ తనకు ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆనక ఎన్నికల కమిషనర్‌ను చేశారు.
నాటి కమిషనర్‌తో ఢీ..
జగన్ ప్రభుత్వం చెప్పినదానికల్లా తానతందానా అనడం నీలం సాహ్నికి మొదటి నుంచీ అలవాటుగా మారింది. అది రంగుల విషయంలోగానీ.. స్థానిక ఎన్నికల విషయంలో గానీ. నిరుడు కరోనా విజృంభణ నేపథ్యంలో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.
దానిపై ఆయన్ను సీఎం నుంచి మంత్రుల వరకు నోటికొచ్చినట్లు తిట్టారు. పంచాయతీరాజ్ అధికారులూ అలాగే మాట్లాడారు. జగన్ ఆదేశాలతో నాటి సీఎస్ నీలం కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడెనిమిది కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని.. పెద్దగా విస్తరించే ప్రమాదమే లేదని.. వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యం అసాధారణం. ఉన్నతాధికారుల జోక్యం లేకుండా చేయడానికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటుచేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కమిషనర్‌కు సాధారణ అధికారికి రాసినట్లు లేఖ రాయడం అప్పట్లోనే కలకలం సృష్టించింది.
రాష్ట్రంలో అప్పట్లో కరోనా నిర్ధారణ కిట్లే లేవు. పరీక్షలే చేయకుండా తమ వద్ద కేసులే లేవని కేంద్రాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు దేశంలోనే అధిక కేసులున్న నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కూడా ఒకటిగా నిలిచింది.