దేశవ్యాప్తంగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తో వైసీపీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఈ షాక్ లో నుంచి వైసీపీ నేతలు తేరుకోక ముందే పోస్టల్ బ్యాలెట్ ల అంశంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో సంతకం చాలని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఈసీ వాదనలను ఏపీ హైకోర్టు సమర్థిస్తూ సంచలన తీర్పునిచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలో ఈసీ నిబంధలను సడలించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం-13ఏపై ఆర్వో సంతకంతో పాటు చేతిరాతతో అయినా హోదా వివరాలు రాయాలన్న నిబంధనకు విరుద్ధంగా ఏపీ సీఈవో మెమో జారీ చేశారని వైసీపీ ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఫర్వాలేదని మెమోలో ఏపీ సీఈవో పేర్కొనడం సీఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఏఫీ ఈసీతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ పై స్టాంపు లేకున్నా కౌంటింగ్ కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పునిస్తూ వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది.