ఏపీ సీఎం జగన్ చేపట్టిన పలు సంక్షేమ పథకాల వ్యవహారం వివాదస్పమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కోసం ఏపీ సర్కార్ చేపట్టిన స్థల సేకరణ వ్యవహారంపై గతంలోనే తీవ్ర చర్చ జరిగింది. కొన్ని స్థలాలను ఇళ్లకు కేటాయించడంపై కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగనన్న ఇళ్ల పథకానికి మరోసారి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ పథకాన్ని అమలు చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేవలం మహిళల పేరిట మాత్రమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్లు నిర్మించడంలో హేతుబద్ధతను కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ పథకంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని, అప్పటిదాకా ఈ పథకాన్ని అమలును నిలిపివేయాలని ఆదేశించింది.
ఇళ్ల పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. మహిళలతోపాటు అర్హులైన వారందరికీ పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై మరింత అధ్యయనం చేయాలని ఆదేశించింది.
ఇళ్ల నిర్మాణం విషయంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యల పై అధ్యయనం చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ వ్యవహారాల శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలతో కూడిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. ఆ కమిటీ ఏర్పాటైన నెలలో కోర్టుకు నివేదిక అందించాలని ఆదేశించింది.
అంతేకాదు, ఆ కమిటీ నివేదికను 2 స్థానిక పత్రికల్లో ప్రచురించి… ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశించింది. కమిటీ నివేదిక ప్రకారం అవసరమైతే అదనంగా భూమి కొని ఇంటి స్థలం విస్తీర్ణం పెంచాలని తెలిపింది. మహిళలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు కోర్టు వ్యతిరేకం కాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్జెండర్లకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని హైకోర్టు తెలిపింది. మహిళల పేరుతో మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం అధికరణ 14,15(1) 39కి విరుద్ధమని, మానవహక్కుల యూనివర్సల్ డిక్లరేషన్‌కు వ్యతిరేకమని పేర్కొంది.