కోర్టు ధిక్కరణ కేసులో ఇటీవల 8 మంది ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. వారందరికీ 2వారాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సంచలన తీర్పునివ్వడం చర్చనీయాంశమైంది. ఐఏఎస్ లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్, విజయ్‌కుమార్ లకు శిక్ష విధించింది. అయితే, వీరంతా ధర్మాసనాన్ని క్షమాపణలు కోరడంతో కోర్టు శిక్షను తప్పించింది.
దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఆ హాస్టళ్లలోని విద్యార్థుల మధ్యాహ్న, రాత్రిపూట భోజన ఖర్చులు, ఒకరోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది. అయితే, ఆ కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురైన శ్రీలక్ష్మీ తన తీర్పును పునఃసమీక్ష చేయాలని తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ఈ పిటిషన్‌ను తొలుత విచారణకే స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. కానీ, శ్రీలక్ష్మీ తరఫు న్యాయివాది తాజాగా వివరణనివ్వడంతో పిటిషన్‌ను విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మికి షాకిచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి గతంలో సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సంచలనం రేపింది. దాల్మియా కేసు విచారణకు రానందున శ్రీలక్ష్మీకి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత రాజధాని కేసుల విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులు వైదొలగాలని ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా ఆమె నిలిచారు.
ఆ పిటిషన్ విచారణ సందర్భంగా శ్రీలక్ష్మిపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వింత వాదనలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మసకబార్చేలా, స్వతంత్రతను దెబ్బతీసేలా ఆధారాల్లేని ఆరోపణలు చేశారంటూ శ్రీలక్ష్మితోపాటు ప్రభుత్వ వైఖరిపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్ సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కీలక కేసుల నుంచి న్యాయమూర్తులను తప్పించాలని ప్రైవేటు వ్యక్తులు డిమాండ్లు చేస్తుంటారని, కానీ ఇక్కడ ప్రభుత్వమే అనూహ్యంగా డిమాండ్ చేస్తోందని వ్యాఖ్యానించింది. ‘బెంచ్ హంటింగ్’ (తమకు గిట్టని న్యాయమూర్తుల వద్దకు పిటిషన్లు వెళ్లకుండా) వ్యూహంతో అవమానించడం, రెచ్చగొట్టే చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది.