ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అనాలోచితంగా ప్రజా దర్బార్ కూల్చివేత మొదలు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వరకు జగన్ సర్కార్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలనాపరంగా జగన్ తీసుకున్న పలు నిర్ణయాలపై హైకోర్టు, సుప్రీం కోర్టులలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
హైకోర్టు, సుప్రీం కోర్టులలో చాలాసార్లు జగన్ సర్కార్ కు అక్షింతలు పడ్డాయి. ఏకంగా న్యాయ వ్యవస్థపై, కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కూడా గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. అయినప్పటికీ పాలన వ్యవహారంలో జగన్ సర్కార్ తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై ఏపీ హైకోర్టు అక్షింతలు వేసింది.
జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లుల చెల్లింపులలో జాప్యంపై సరైన సమాధానమివ్వాలని, లేకుంటే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
2018 నుంచి 2019 వరకు పెండింగ్ బిల్లుల వివరాలు కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్రం నుంచి నిధులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పిన సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. 2018 నుంచి 2019 వరకు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని హైకోర్టు ప్రశ్నించింది.
రూ. 5 లక్షల లోపు ఉన్న బిల్లులకు 20 శాతం తగ్గించి ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీలో 2018 నుంచి 2019 వరకు నరేగా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. దీనిపై న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్ పిటిషన్లు వేశారు. దీనిపై సుమారు ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది.