నవ్యాంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతిని జగన్ సర్వ నాశనం చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు కోర్టు మెట్లెక్కి మరీ అమరావతే తమ రాజధాని అని నిరూపించుకున్నారు. అందుకోసం, గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర కూడా చేపట్టారు. ఆ పాదయాత్రకు అనూహ్య స్పందన రావడంతో…దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు.
ఆ పాదయాత్రకు అనుమతులు,షరతులు అంటూ నానా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే, అమరావతి సాధనే లక్ష్యంగా కదం తొక్కిన రైతులు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ పాదయాత్రతో పాటు కోర్టు తీర్పు కూడా తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రభుత్వం అమరావతిపై రాజీ పడాల్సి వచ్చింది. అయితే, తాజాగా ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజదాని రైతులు మరోసారి మహాపాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు.
అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ సారి అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఈ పాదయాత్రకు అనుమతినివ్వాలని రాష్ట్ర పోలీసు శాఖకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఇప్పటిదాకా పోలీసు శాఖ నుంచి ఆ దరఖాస్తుపై ఎటువంటి స్పందన రాలేదు. దీంతో, ఈ వ్యవహారంలో కల్పించుకుని తమకు న్యాయం చేయాలని అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు…ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రంలోగా మహాపాదయాత్రపై ఏదో ఒకటి తేల్చాలని పోలీసులు, ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే శుక్రవారం తొలి కేసుగా ఈ పిటిషన్పైనే విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. దీంతో, అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట లభించగా..జగన్ కు షాక్ తగిలినట్లయింది.
Comments 3